SIT: 150 పేజీలతో కూడిన నివేదికను డీజీపీకి అందించిన సిట్
- ఏపీలో పోలింగ్ రోజున, ఆ తర్వాత హింసాత్మక ఘటనలు
- దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు
- తిరుపతి, పల్నాడు, అనంతపురం జిల్లాల్లో జరిగిన ఘటనలపై సిట్ దర్యాప్తు
- సిట్ నివేదికను సీఈవో, సీఈసీకి పంపనున్న ఏపీ ప్రభుత్వం
ఏపీలోని పలు జిల్లాల్లో పోలింగ్ నేపథ్యంలో జరిగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సిట్ నియామకానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఏపీ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో సిట్ ను నియమించింది.
పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు జరిపింది. ఈ మేరకు 150 పేజీలతో ప్రాథమిక నివేదిక రూపొందించిన సిట్... ఆ నివేదికను నేడు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు సమర్పించింది. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ నేడు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను కలిసి నివేదికను అందించారు.
పోలింగ్ నేపథ్యంలో... పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో 33 ఘటనలు జరిగినట్టు సిట్ గుర్తించింది. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్ ను పరిశీలించింది. స్థానికులు, పోలీసులను కూడా సిట్ సభ్యులు విచారించారు.
కాగా, ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్ లలో కొత్త సెక్షన్లు చేర్చే విషయంలో సిట్ కీలక సిఫారసులు చేసింది. కొత్త ఎఫ్ఐఆర్ లు నమోదు చేయాలా, వద్దా? అనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.
చట్ట ప్రకారం నేరాల నమోదు అనే అంశానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు సిట్ స్పష్టం చేసింది. మూడు జిల్లాల్లో జరిగిన ఘటనలు తీవ్రమైన నేరాలుగా పరిగణించాలని సిఫారసు చేసింది. నేరాల తీవ్రత మేరకు అదనపు సెక్షన్లు జోడించడంపై ఆదేశాలు ఇచ్చినట్టు వివరించింది. జరిగిన నేరాల్లో డిజిటల్ ఆధారాలను కూడా సేకరించాలని ఆదేశించినట్టు తెలిపింది.
కేసుల దర్యాప్తులో తీవ్ర లోపాలు గుర్తించినట్టు వెల్లడించింది. రెండు వర్గాల ఘర్షణలు మరణాలకు కారణమై ఉండేవని సిట్ అభిప్రాయపడింది. క్షేత్రస్థాయి పర్యటనలో బాధితుల నుంచి తమకు విజ్ఞాపనలు వచ్చాయన్న విషయాన్ని కూడా సిట్ తన నివేదికలో పొందుపరిచింది. బాధితుల విజ్ఞాపనలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుని, నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారా, లేదా? అనే అంశాలు నివేదికలో పొందుపరిచినట్టు సిట్ వెల్లడించింది. 33 కేసుల్లో ఎఫ్ఐఆర్ ల ప్రకారం 1,370 మంది నిందితులుగా ఉన్నారని, ఇప్పటివరకు 124 మందిని అరెస్ట్ చేసినట్టు సిట్ వివరించింది. ఆయా కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారులు మిగతా నిందితులను కూడా అరెస్ట్ చేయాలని తన నివేదికలో సిఫారసు చేసింది. త్వరితగతిన కేసుల దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేసింది.
హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసి కూడా కొందరు నిర్లక్ష్యం చేశారని, హింసాత్మక ఘటనలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని సిట్ తన నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. స్థానిక నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, అందుకు బలం చేకూర్చేలా సిట్ పలు ఆధారాలు సేకరించినట్టు సమాచారం.
సిట్ ప్రాథమిక నివేదిక నేపథ్యంలో... రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకు సంబంధించి కొందరు అధికారులపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. కాగా సిట్ అందించిన నివేదికను ఏపీ ప్రభుత్వం కాసేపట్లో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)కి, సీఈసీకి పంపనుంది.