Rahul Gandhi: ప్రచార సభలో ప్రసంగించకుండానే వెళ్లిపోయిన రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్.. కారణం ఇదే!

Rahul Gandhi AND Akhilesh Yadav Left Rally Without Giving Speech

  • ఉత్తరప్రదేశ్ లోని పూల్ పూర్ లో కాంగ్రెస్, ఎస్పీ ఉమ్మడి సభ
  • బ్యారికేడ్లు దాటుకుని వేదిక వద్దకు దూసుకొచ్చిన అభిమానులు
  • సభ వద్ద తగినంత మంది పోలీసులు లేరన్న కాంగ్రెస్

ఉత్తరప్రదేశ్ లోని పూల్ పూర్ ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ప్రసంగించకుండానే వెళ్లిపోయారు. ఇండియా కూటమి అభిమానుల అత్యుత్సాహమే దీనికి కారణం. సభ కొనసాగుతున్న సమయంలో కూటమి అభిమానులు బ్యారికేడ్లను దాటుకుని వేదిక వద్దకు వచ్చే ప్రయత్నం చేశారు. అఖిలేశ్ యాదవ్ వేదికపైకి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక రకంగా చెప్పాలంటే తొక్కిసలాట వంటి పరిస్థితి అక్కడ నెలకొంది.  

ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రేవతి రమణ్ సింగ్ మాట్లాడుతూ... ర్యాలీకి పెద్ద సంఖ్యలో మద్దతుదారులు హాజరయ్యారని... ఇదే సమయంలో తగినంత మంది పోలీసు సిబ్బంది లేరని చెప్పారు. కూటమి మద్దతుదారులను నిలువరించడం సాధ్యం కాలేదని... వాళ్లు బ్యారికేడ్లను దాటుకుని వేదిక వద్దకు వచ్చారని తెలిపారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో రాహుల్, అఖిలేశ్ సభ మధ్యలోనే ప్రసంగించకుండా వెళ్లిపోయారని చెప్పారు.

More Telugu News