Srikanth: తాను రేవ్ పార్టీలో పట్టుబడ్డానంటూ వస్తున్న వార్తలపై నటుడు శ్రీకాంత్ స్పందన

Is Tollywood actor Srikanth attended rave party

  • బెంగళూరులో రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు
  • పట్టుబడిన వారిలో తెలుగు బుల్లితెర నటులు, మోడల్స్!
  • వీడియో ఫుటేజిలో ఉన్నది శ్రీకాంతేనా...?

బెంగళూరులో ఓ వ్యాపారవేత్త ఏర్పాటు చేసిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటులు, మోడల్స్ పట్టుబడినట్టు వార్తలు వచ్చాయి. 

అంతేకాదు, రేవ్ పార్టీలో పాల్గొన్నవారిలో టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. పోలీసులు రేవ్ పార్టీ నుంచి వెలుపలికి తీసుకువచ్చిన వ్యక్తుల్లో శ్రీకాంత్ (ముఖం కనిపించకుండా కప్పేసుకున్నాడు) పోలికలతో ఓ వ్యక్తి ఉన్నట్టు ఓ వీడియో ఫుటేజిలో కనిపిస్తోంది. 

దీనిపై శ్రీకాంత్ స్పందించారు. తాను రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. తాను హైదరాబాదులోనే ఉన్నానని, బెంగళూరు వెళ్లలేదని తెలిపారు. కన్నడ మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవం అని పేర్కొన్నారు.

అతడ్నిచూసి నేను షాకయ్యాను

మా ఇంట్లో వాళ్లు ఈ వార్తలు చూసి నవ్వుకున్నారు. మొన్నేమో నా భార్యతో నాకు విడాకులు ఇప్పించేశారు... ఇవాళేమో బెంగళూరులో రేవ్ పార్టీలో పాల్గొన్నానని రాశారు. అయితే, మీడియాలో కొందరు తొందరపడడంలో ఆశ్చర్యం లేదనిపించింది. అతనెవరో కానీ కొంచెం నాలాగానే ఉన్నాడు. కొంచెం గడ్డం కూడా ఉంది. అతడ్ని చూసి నేను కూడా షాకయ్యాను. 

తెలిసినవాళ్లందరూ నాకు ఫోన్లు మీద ఫోన్లు చేశారు. మీడియా మిత్రులు నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. నాది రేవ్ పార్టీలకు వెళ్లే కల్చర్ కాదు. నేను పబ్ కల్చర్ మనిషిని కాదు. ఏదైనా బర్త్ డే పార్టీలకు వెళ్లినా ఓ అరగంట ఉండి వచ్చేస్తాను తప్ప, రేవ్ పార్టీలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు. ప్రస్తుతం నేను మా ఇంట్లోనే ఉండి మాట్లాడుతున్నాను. 

మీడియా మిత్రులకు కూడా నేను చెప్పేది ఏంటంటే... ఏ విషయం అయినా పూర్తిగా నిర్ధారించుకున్నాకే రాయండి. అతడు నాలాగా ఉన్నాడన్న కారణంతో మీరు పొరబడి ఉంటారనుకుంటున్నాను... అది నేను కాదు. కొందరు మీడియా మిత్రులు  నన్ను అడిగి నిజనిర్ధారణ చేసుకుని వాళ్ల సంస్థల్లో వార్త వేయలేదు. అలాంటి వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను... అంటూ శ్రీకాంత్ ఓ వీడియోలో వివరణ ఇచ్చారు.

More Telugu News