Etela Rajender: లోక్ సభ ఎన్నికల్లో మోదీకే ఓటేస్తామని ప్రజలు అప్పుడే స్పష్టంగా చెప్పారు: ఈటల రాజేందర్
- కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శ
- బీఆర్ఎస్కు తెలంగాణలో ఇక మనుగడ లేదని జోస్యం
- పదేళ్ల మోదీ పాలన బీజేపీ కార్యకర్తలకు గుర్తింపునిచ్చిందని వ్యాఖ్య
'ఈసారి అయితే మీకు వేస్తున్నాం కానీ... వచ్చేసారి మాత్రం మోదీ గారికే ఓటు వేస్తామని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పారని బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ అన్నారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఉపఎన్నిక సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని... కానీ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం మోదీకి వేశారన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ హామీని నెరవేర్చలేదన్నారు. సంక్షేమం, మౌలిక వసతుల కల్పనలో కాంగ్రెస్ కుంటుపడిందన్నారు. బీఆర్ఎస్కు తెలంగాణలో ఇక మనుగడ లేదని జోస్యం చెప్పారు. సమస్యల మీద పోరాటం చేసే పార్టీ కేవలం బీజేపీ మాత్రమే అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా బాంబు పేలుళ్లు జరిగేవన్నారు.
ఈ పదేళ్ల మోదీ పాలన బీజేపీ కార్యకర్తలకు గుర్తింపునిచ్చిందన్నారు. ఇదివరకు ప్రపంచవ్యాప్తంగా బలమైన నేత అంటే అమెరికా, బ్రిటన్, రష్యా నేతల పేర్లే చెప్పేవారనీ... ఇప్పుడు మోదీ పేరు వినిపిస్తోందన్నారు. బెలూచిస్తాన్ ప్రజలు కూడా భారత్‌లో ఉంటే బాగుండును అనుకునేలా మోదీ పాలన ఉందన్నారు.
ఒకప్పుడు అమెరికా మోదీకి వీసాను నిరాకరించిందని, కానీ ఇప్పుడు రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతోందన్నారు. ప్రజలు ఆదరిస్తే ఎలా ఉంటుందో 2006లో ఉద్యమం సమయంలో కరీంనగర్ చూపించిందని, అదే సమయంలో ప్రజలు పట్టించుకోకుంటే ఎలా ఉంటుందో 2008 సాక్ష్యమన్నారు. అప్పుడు టీఆర్ఎస్ 17 సీట్లలో పోటీ చేస్తే కేవలం 7 మాత్రమే గెలిచిందన్నారు.