Rave Party: బెంగళూరు శివార్లలోని ఫాంహౌస్ లో రేవ్ పార్టీ

Rave Party In Bengalore FarmHouse

  • ఏపీ యువకుడి బర్త్ డే సందర్భంగా ఏర్పాటు
  • హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
  • ఓ కారులో ఏపీ ఎమ్మెల్యే స్టిక్కర్.. కారు తనది కాదన్న ఎమ్మెల్యే

బెంగళూరు శివార్లలోని ఓ ఫాంహౌస్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని కర్ణాటక పోలీసులు భగ్నం చేశారు. ఈ పార్టీకి హాజరైన సుమారు వంద మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన వాసు అనే యువకుడి పుట్టిన రోజు సందర్భంగా ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం మొదలైన పార్టీకి తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు పలువురు హాజరైనట్లు తెలుస్తోంది. ఫాంహౌస్ ఆవరణలో ఉన్న ఓ కారులో ఏపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ కు చెందిన స్టిక్కర్ ను గుర్తించినట్లు కన్నడ మీడియా పేర్కొంది. అయితే, ఆ కారు తనది కాదని ఏపీ ఎమ్మెల్యే కాకాణి వివరణ ఇచ్చారు.

ఫాంహౌస్ లో రేవ్ పార్టీ జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారంతో సీసీబీ పోలీసుల బృందం రెయిడ్ చేసింది. దాదాపు మూడు గంటల పాటు ఫాంహౌస్ లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. 17 ఎండీఎంఏ ట్యాబ్లెట్లు, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫాంహౌస్ ఆవరణలో పార్క్ చేసిన మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్ తదితర 15కు పైగా లగ్జరీ కార్లను సీజ్ చేశారు. పార్టీకి హాజరైన వారిలో తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరుకు చెందిన వారు కూడా ఉన్నారని, 25 మంది యువతులు కూడా ఉన్నారని సమాచారం. సినీ నటి హేమ కూడా ఈ పార్టీకి హాజరయ్యారని కన్నడ మీడియా వార్తలు ప్రసారం చేయగా.. నటి హేమ ఈ వార్తలను కొట్టిపారేశారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నట్లు వివరణ ఇచ్చారు.

More Telugu News