IPL 2024: ముగిసిన ఐపీఎల్ 2024 లీగ్ ద‌శ‌.. ప్లేఆఫ్స్ పూర్తి షెడ్యూల్ ఇదే!

IPL 2024 Playoffs Schedule Who Plays Who

  • ప్లేఆఫ్స్ కు చేరిన కేకేఆర్‌, ఎస్ఆర్‌హెచ్‌, ఆర్ఆర్, ఆర్‌సీబీ
  • క్వాలిఫయర్-1: సన్ రైజర్స్ X కేకేఆర్ (అహ్మదాబాద్- మంగళవారం)
  • ఎలిమినేటర్: ఆర్సీబీ X రాజస్థాన్ (అహ్మదాబాద్‌- బుధ‌వారం)
  • మే 26న రాత్రి 7.30 గంట‌ల‌కు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఫైన‌ల్

ఐపీఎల్ సీజ‌న్ 17 లీగ్ దశ ముగిసింది. టాప్-4 జట్లు ప్లేఆఫ్స్ కు చేరాయి. లీగ్ దశలో అత్యధిక విజయాలు (9) సాధించిన కోల్‌క‌తా నైట్ డర్స్ (కేకేఆర్) పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో నిలిచింది. ఆ త‌ర్వాత‌ సన్ రైజర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) 8 విజ‌యాల‌తో రెండో స్థానంలో ఉండ‌గా, రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కూడా 8 విజ‌యాల‌తో మూడో స్థానంలో ఉంది. ఇక డిపెండింగ్ ఛాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్‌పై త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో సూప‌ర్ విక్ట‌రీతో ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చిన‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 7 విజయాల‌తో నాలుగో స్థానంలో నిలిచింది. 

ఇక టాప్- 2లో ఉన్న నైట్ రైడ‌ర్స్‌- సన్ రైజర్స్ క్వాలిఫయర్-1లో త‌ల‌పడనున్నాయి. ఇందులో నెగ్గిన జట్టు నేరుగా ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. ఓడిన జ‌ట్టు క్వాలిఫయర్- 2కు వెళ్తుంది. ఇక రాజస్థాన్- బెంగళూరు జట్లు ఎలిమినేటర్ లో పోటీ పడనున్నాయి. ఇందులో విజయం సాధించిన టీమ్ క్వాలిఫయర్- 2కు వెళ్లగా, ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్ర‌మిస్తుంది.

క్వాలిఫయర్-1: అహ్మదాబాద్ వేదికగా మంగళవారం (మే 21) రాత్రి 7.30 గంట‌ల‌కు ఈ మ్యాచ్ జరగనుంది. లీగ్ దశలో అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న టాప్ 2 జట్ల మధ్య జరగనున్న పోరు మరింత ఆసక్తి రేపుతోంది. లీగ్ మ్యాచులో సన్ రైజర్స్ ను ఓడించిన కేకేఆర్ క్వాలిఫయర్ లోనూ సత్తా చాటాలని చూస్తోంది. ఇటు అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న హైద‌రాబాద్‌ ను ఓడించడం కూడా అంత సులువేం కాదు. ఈ పోటీలో నెగ్గి ముందుగా ఫైనల్ బెర్తు ఖరారు చేసుకునే జ‌ట్టు ఏది? అనేది రేప‌టి మ్యాచ్‌తో తేలిపోతుంది. 

ఎలిమినేటర్: బుధవారం (మే 22) రాత్రి 7.30 గంట‌ల‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ ఎలిమినేటర్లో తలపడనున్న రెండు జట్లు టోర్నీని చాలా భిన్నంగా ప్రారంభించిన విష‌యం తెలిసిందే. వరుస విజయాలతో రాజస్థాన్ రాయ‌ల్స్‌ లీగ్ ను మొద‌లుపెట్ట‌గా, వరుస ఓటములతో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌ టోర్నీ ఫస్ట్ హాఫ్ లో సతమతమైంది. ఒక దశలో టోర్నీ నుంచి నిష్క్రమించే స్థాయికి వెళ్లిన ఆర్‌సీబీ తర్వాత పుంజుకొని వ‌రుస‌గా 6 విజ‌యాల‌తో టాప్- 4లోకి దూసుకురావడం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు ఆర్ఆర్‌ లీగ్ దశను పేలవంగా ముగించింది. రాజస్థాన్ ఆడిన‌ చివరి ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో ప‌రాజ‌యం పొంద‌గా, ఒకటి వ‌ర్షం కార‌ణంగా రద్ద‌యింది. అంటే చివరి ఐదు మ్యాచుల్లో ఒక్క విజయం కూడా ఆ జ‌ట్టు ఖాతాలో లేదు. అటు బెంగ‌ళూరు మాత్రం చివరగా ఆడిన ఆరు మ్యాచుల్లోనూ విజయంతో మంచి ఊపు మీద ఉంది. కానీ, నాకౌట్ దశలో రాజస్థాన్ను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆ జట్టుకు ఎప్పుడైనా పుంజుకునే స‌త్తా ఉంది. అందుకే ఈ పోటీ కూడా అంత ఈజీగా ఉండ‌క‌పోవ‌చ్చు. ర‌స‌వ‌త్తరంగా ఈ మ్యాచ్ జ‌ర‌గ‌డం ఖాయం. 

ఫైన‌ల్‌: ఇక ఫైన‌ల్ మ్యాచ్ మే 26న రాత్రి 7.30 గంట‌ల‌కు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జ‌రుగుతుంది. క్యాలిఫ‌య‌ర్‌-1 విజేత‌తో క్వాలిఫ‌య‌ర్‌-2లో గెలిచిన జ‌ట్టు ఫైనల్‌ల్లో త‌ల‌ప‌డుతుంది.

  • Loading...

More Telugu News