Narendra Modi: కాంగ్రెస్, దాని మిత్రపక్షాల సీఎంలకు ఇదే నా సవాల్: ప్రధాని మోదీ

PM Modi challenges Congress and alliance Chief Ministers
  • ఉత్తరాది రాష్ట్రాల్లో మోదీ ఎన్నికల ప్రచారం
  • రాహుల్ గాంధీ భాష మావోయిస్టుల భాషలా ఉందని విమర్శలు
  • కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో పెట్టుబడులు రావడంలేదని వెల్లడి
ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ వాడే భాష మావోయిస్టుల భాషలా ఉందని అన్నారు. దేశంలో కాంగ్రెస్, వారి మిత్ర పక్షాలు పాలిస్తున్న చోట పెట్టుబడులు రావడంలేదని విమర్శించారు. 

"కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఎక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ వంటి రాష్ట్రాల్లోని సీఎంలకు ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నా... మీ రాష్ట్రాలకు పెట్టుబడులు వస్తున్నాయా? ఇది నా రాజకీయ ప్రకటన కాదు... ఇది నా ఎన్నికల ప్రకటన కాదు... ఇదే విషయాన్ని ఆయా రాష్ట్రాల  ముఖ్యమంత్రులను తటస్థ మీడియా కూడా నిలదీయాలి" అని మోదీ పేర్కొన్నారు. 

జూన్ 4 తర్వాత బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని మోదీ ధీమా వ్యక్తం చేశారు. అవినీతిపరులు జీవితాంతం జైలులోనే గడపాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ, జేఎంఎంకు అభివృద్ధి గురించి ఏమీ తెలియదని అన్నారు. 

"వారి యువరాజు రాహుల్ పరిశ్రమలను, వ్యాపారవేత్తలను, పెట్టుబడులను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇలా చేస్తే ఏ వ్యాపారవేత్త వెళ్లి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతాడు? ఆ రాష్ట్రాల యువత భవిష్యత్ ఏమవుతుంది? నా వద్దకు వచ్చే పెట్టుబడిదారులందరూ తాము ఆ రాష్ట్రాలకు వెళ్లబోమని చెబుతున్నారు. ఎందుకంటే తమకు వ్యతిరేకంగా ఉన్న భావజాలంతో ఆ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయని, తమను దూషిస్తారని వారు నాతో చెప్పారు. 

యువరాజే అలాంటి ఆలోచనలతో ఉంటే మిత్రపక్షాలు కూడా అదే తరహా ఆలోచనలతో ఉంటాయని పెట్టుబడిదారులు అనుకుంటారు" అంటూ మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు  పాలిస్తున్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఒకటికి 50 సార్లు ఆలోచించే పరిస్థితి నెలకొందని అన్నారు.
Narendra Modi
BJP
Congress
INDIA Bloc
General Elections

More Telugu News