SRH: ఆడుతూ పాడుతూ... అలవోకగా గెలిచిన సన్ రైజర్స్

SRH registers easy victory against Punjab and ended league stage with win

  • విజయంతో ఐపీఎల్-17 లీగ్ దశ ముగించిన సన్ రైజర్స్
  • పంజాబ్ కింగ్స్ పై 4 వికెట్ల తేడాతో విజయం
  • 215 పరుగుల లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలుండగానే అందుకున్న కమిన్స్ సేన

ఐపీఎల్ 17వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆట మరో రేంజిలో ఉంది. ఇవాళ పంజాబ్ కింగ్స్ పై 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 215 పరుగుల లక్ష్యఛేదనను సన్ రైజర్స్ టీమ్ మరో 5 బంతులు మిగిలుండగానే ఫినిష్ చేసింది. 

ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 214 పరుగులు చేయగా... సన్ రైజర్స్ హైదరాబాద్ 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసి విజయభేరి మోగించింది. 

విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ (0) తొలి బంతికే వెనుదిరిగినా... మరో ఓపెనర్ అభిషేక్ శర్మ తాను ఉన్నానంటూ పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అభిషేక్ శర్మ 28 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు సాధించాడు. మరో ఎండ్ లో రాహుల్ త్రిపాఠి 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 33 పరుగులు చేశాడు. 

తెలుగుతేజం నితీశ్ రెడ్డి మరోసారి తన పవర్ హిట్టింగ్ తో అలరించాడు. నితీశ్ 25 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులతో 37 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

ఇక, హెన్రిచ్ క్లాసెన్ కూడా తన ట్రేడ్ మార్క్ షాట్లతో విరుచుకుపడడంతో పంజాబ్ కింగ్స్ కు కష్టాలు తప్పలేదు. క్లాసెన్ 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేసి ఆరో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2, హర్షల్ పటేల్ 2, హర్ ప్రీత్ బ్రార్ 1, శశాంక్ సింగ్ 1 వికెట్ తీశారు. 

సునాయాస విజయంతో లీగ్ దశను ముగించిన సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. లీగ్ దశలో మొత్తం 14 మ్యాచ్ ల్లో 8 విజయాలు సాధించిన సన్ రైజర్స్ ఖాతాలో 17 పాయింట్లు ఉన్నాయి. 

ఈ రాత్రి 7.30 గంటలకు కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుంది. ఇందులో రాజస్థాన్ ఓడిపోతే సన్ రైజర్స్ రెండో స్థానంలో ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ రాజస్థాన్ గెలిస్తే 18 పాయింట్లతో ఆ జట్టు రెండో స్థానానికి చేరుకుంటుంది. సన్ రైజర్స్ మూడోస్థానానికి పడిపోతుంది. 

కాగా, కోల్ కతా, రాజస్థాన్ మ్యాచ్ లో ఇంతవరకు టాస్ పడలేదు. మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న గౌహతిలో వర్షం పడుతుండడమే అందుకు కారణం.

  • Loading...

More Telugu News