Bibhav Kumar: స్వాతి మలివాల్ పై దాడి కేసు..ఢిల్లీ సీఎం సహాయకుడికి 5 రోజుల కస్టడీ

Arvind Kejriwal Aide Sent To Police Custody For 5 Days In Swati Maliwal Case
  • శనివారం బిభవ్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
  • కేసులో నిజానిజాలు తేల్చేందుకు ఏడు రోజుల కస్టడీ కోరిన వైనం
  • ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించిన తీస్ హజారీ కోర్టు

ఆప్ ఎంపీ స్వాతి స్వాతి మలివాల్ పై దాడి కేసులో శనివారం ఢిల్లీ కోర్టు సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్‌కు ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. సోమవారం సీఎం నివాసంలో బిభవ్ తనపై దాడి చేశాడని స్వాతి మలీవాల్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనను ఛాతి, కడుపు, ఉదరం దిగువ భాగంలో బిభవ్ తన్నాడని, నేలపై ఈడ్చాడని, షర్టు పైకి లాగాడని స్వాతి తన ఫిర్యాదులో పేర్కొంది. 

ఈ నేపథ్యంలో పోలీసులు శనివారం బిభవ్ ను అరెస్టు చేసి తీస్ హజారీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఏడు రోజుల కస్టడీ కోరారు. ఆప్ ఎంపీపై దాడి జరిగిందని, ఆమె షర్ట్ బటన్లు తొలగించినట్టు ఉందని, సీఎం నివాసం నుంచి తమకు కొంత సీసీటీవీ ఫుటేజీ కూడా లభించిందని చెప్పారు. బిభవ్ ఫోన్ పాస్ వర్డ్ అడిగినా అతడు ఇవ్వలేదని అన్నారు. ఆధారాలు ధ్వంసం చేసేందుకు ఫోన్ ఫార్మాట్ చేశాడని ఆరోపించారు. అయితే, తన ఫోన్ హంగ్ కావడంతో ఫార్మాట్ చేయాల్సి వచ్చినట్టు బిభవ్ చెప్పినట్టు తెలిపారు. ముంబైలో నిపుణుల సాయంతో బిభవ్ సమక్షంలో అతడి ఫోన్ అన్ లాక్ చేయాల్సి ఉందని కాబట్టి, అతడిని కస్టడీకి ఇప్పించాలని కోరారు. ఎంపీపై దాడికి గల కారణాలు వెలికి తీసేందుకు బిభవ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉందని పేర్కొన్నారు. 

బిభవ్ తరఫు లాయర్ తన వాదనలు వినిపిస్తూ సోమవారం దాడి జరిగితే శనివారం ఆలస్యంగా ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేశారని ప్రశ్నించారు. స్వాతి మలివాల్ ముఖ్యమంత్రి కార్యాలయానికి కాకుండా నివాసానికి వెళ్లారని పేర్కొన్నారు. విజిటింగ్ అవర్స్‌కు ఆవల ఆమె సీఎం నివాసానికి వెళ్లినట్టు గుర్తించారు. స్వాతి మలివాల్ కు సంబంధించి నెట్టింట వైరల్ అవుతున్న వీడియో గురించి ఆయన ప్రస్తావించారు. ఫోన్ పాస్ వర్డ్ ఇవ్వాలంటూ ఎవరినీ ఒత్తిడి చేయకూడదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించారు. 

మరోవైపు, బిభవ్ అప్పటికే అరెస్టైనందున అతడి యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ను కూడా కోర్టు తిరస్కరించింది.

  • Loading...

More Telugu News