Heavy Rain: బంగాళాఖాతంలో వాయుగుండం... కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

Heavy Rain alert for AP Coastal areas

  • ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
  • మే 24 నాటికి వాయుగుండం
  • ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
  • కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు
  • దక్షిణ అండమాన్ సముద్రంలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు

బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. 

ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. 

ఈ నేపథ్యంలో, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మే 23 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ పేర్కొంది. కోస్తాంధ్రతో పాటు, తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 

మరోవైపు, నైరుతి రుతుపవనాల విషయంలో వాతావరణ శాఖ తియ్యని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించాయని, ప్రస్తుతం ఇవి చురుగ్గా కదులుతున్నాయని వివరించింది. రేపటికి బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది.

  • Loading...

More Telugu News