Indian Students: కిర్గిస్థాన్‌లోని భార‌త విద్యార్థులు బ‌య‌ట‌కు రావొద్దు: కేంద్రం

Indian Embassy advises students in Kyrgyzstan to stay indoors amid reports of violence

  • కిర్గిస్థాన్ రాజ‌ధాని బిషెక్‌లో విదేశీ విద్యార్థులే లక్ష్యంగా దాడులు
  • ఈ నేప‌థ్యంలోనే భార‌తీయ విద్యార్థుల‌కు ఎంబ‌సీ అల‌ర్ట్‌
  • ఏదైనా స‌మ‌స్య ఉంటే వెంట‌నే రాయ‌బార కార్యాల‌యాన్ని సంప్ర‌దించాలంటూ ట్వీట్‌
  • ఈ నెల 13న ఈజిప్ట్‌, కిర్గిస్థాన్ విద్యార్థుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ 
  • ఘ‌ర్ష‌ణ‌ తాలూకు వీడియోలు వైర‌ల్ కావ‌డంతోనే విదేశీ విద్యార్థుల‌పై దాడుల‌న్న ఎంబ‌సీ

కిర్గిస్థాన్ రాజ‌ధాని బిషెక్‌లో విదేశీ విద్యార్థుల‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు జ‌రుగుతున్న నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం అక్క‌డ ఉంటున్న మ‌నోళ్ల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. ప్ర‌స్తుతం అక్క‌డి ఆందోళ‌న‌కర‌ ప‌రిస్థితి దృష్ట్యా భార‌త విద్యార్థులు ఎవ‌రూ బ‌య‌ట‌కు రావొద్ద‌ని తెలిపింది. ఈ మేర‌కు అక్క‌డి భార‌త ఎంబ‌సీ ఎక్స్ (ట్విట‌ర్‌) వేదిక‌గా కీల‌క సూచ‌న చేసింది.

"మ‌న స్టూడెంట్స్ తాలూకు స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటున్నాం. ప్ర‌స్తుతానికి ప‌రిస్థితి ప్ర‌శాంతంగానే ఉన్న‌ప్ప‌టికీ, విద్యార్థులు బ‌య‌ట‌కు రావొద్దు. ఏదైనా స‌మ‌స్య ఉంటే వెంట‌నే రాయ‌బార కార్యాల‌యాన్ని సంప్ర‌దించండి" అని ఎంబ‌సీ ట్వీట్ చేసింది. అలాగే 24 గంట‌లు అందుబాటులో ఉండే 0555710041 అనే ఫోన్ నంబ‌ర్ కూడా ఇచ్చింది. ఈ నెల 13న ఈజిప్ట్‌, కిర్గిస్థాన్ విద్యార్థుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ తాలూకు వీడియోలు వైర‌ల్ అయిన నేప‌థ్యంలో విదేశీ విద్యార్థుల‌పై దాడుల‌కు దారితీసిన‌ట్లు రాయ‌బార కార్యాల‌యం పేర్కొంది.

More Telugu News