Devineni Uma: ఐప్యాక్ ఆఫీసులో జగన్ చెప్పిన మాటలు పనిచేయలేదు... అందుకే సజ్జల మళ్లీ మీడియా ముందుకొచ్చాడు: దేవినేని ఉమా

Devineni Uma slams Sajjala and other YCP leaders

  • నిన్న విజయవాడలో ఐప్యాక్ ఆఫీసుకు వెళ్లిన సీఎం జగన్
  • 151కి పైగా అసెంబ్లీ స్థానాలు, 22కి పైగా ఎంపీ స్థానాలు గెలుస్తున్నామని ధీమా
  • అయితే జగన్ మాటలు వైసీపీ శ్రేణులకు ధైర్యాన్ని కలిగించలేకపోయాయన్న ఉమా
  • సజ్జల ఈ ఉదయం మళ్లీ గోబెల్స్ ప్రచారం చేయడానికి వచ్చాడని విమర్శలు
  • 40 మంది మంత్రుల్లో ఒక్కరూ తాము గెలుస్తామని ధైర్యంగా చెప్పడంలేదని ఎద్దేవా

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిన్న విజయవాడ ఐప్యాక్ కార్యాలయంలో చెప్పిన మాటలేవీ వైసీపీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని కలిగించలేకపోయాయని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా అన్నారు. ఇవాళ ఆయన అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ మాటలు పనిచేయకపోవడంతో ఈ ఉదయం ఆంధ్రా గోబెల్స్ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చాడని పేర్కొన్నారు. 

నాడు పార్లమెంటు భవనాన్ని హిట్లర్ ఎలా తగలబెట్టుకుని ప్రతిపక్షాలపై ఆరోపణలు చేశాడో, ఇప్పుడు గోబెల్స్ కూడా పెద్దారెడ్డి ఇంటిపై మేం దాడి చేశామని, మేం సీసీ కెమెరాలు పగులగొట్టామని అసత్యప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. 

"జగన్ మాటలను వైసీపీ శ్రేణులు నమ్మడం లేదు... అందుకే వైసీపీ క్యాడర్ కాడి వదిలేసింది. నాయకులు, కార్యకర్తలు మీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రేమో విదేశాలకు వెళ్లిపోతున్నాడు, మీ నాయకుల తాలూకు కంపెనీల వాహనాల బయటి రాష్ట్రాలకు, బయటి దేశాలకు పంపించేసుకుంటున్నారు. అందుకు చిత్తూరు జిల్లాలో పీఎల్ఆర్ కంపెనీ వాహనాలు ఎక్స్ పోర్ట్ అవుతుండడమే నిదర్శనం. ఎవర్ని నమ్మించాలని సజ్జలా... ఇవాళ మళ్లీ సొల్లు కబుర్లు మొదలుపెట్టావు? 

కేఏ పాల్ ఆత్మవిశ్వాసం ఏ స్థాయిలో ఉందో, నిన్న జగన్ మాటల్లో ఆత్మవిశ్వాసం కూడా అదే స్థాయిలో ఉంది! కాబట్టి పిచ్చి ప్రేలాపనలు మానేయండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ కొంప ముంచింది. మీ ప్రచార పిచ్చి, మీ ఫొటోల పిచ్చి... తాతముత్తాలు ఇచ్చిన భూములను కొట్టేయాలని మీరు చేసిన చట్టాలే మీ ప్రభుత్వానికి ఉరితాళ్లు అయ్యాయి. 

ఇవాళ ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చింది. దాని ఫలితమే జనసునామీ... అందుకే మీకు చెవులు గింగుర్లెతుత్తున్నాయి... దాంతో రోజుకొకరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మొదటి క్యాబినెట్ లో కానీ, రెండో క్యాబినెట్ లో కానీ... 40 మంత్రుల్లో ఒక్కడు కూడా మీడియా ముందుకు వచ్చి మేం గెలుస్తున్నాం అని ధైర్యంగా మాట్లాడడంలేదు... 40 మంది మంత్రులు ఓడిపోతున్నారు. 

మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మీడియా ఘోషిస్తుంటే, సర్వేలు చెబుతుంటే... ఇవాళ  సజ్జల వచ్చి ఏ నాయకుడ్ని నమ్మిద్దామని, ఏ కార్యకర్తను నమ్మిద్దామని మళ్లీ బురద చల్లే కార్యక్రమం చేస్తున్నాడు? సిగ్గుందా అని అడుగుతున్నా? 

ఈసీ మీద, టీడీపీ మీద, ఎన్డీయే కూటమి మీద సజ్జల బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. భయం కళ్లలో కనిపిస్తోంది, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి లండన్ వెళ్లి తిరిగొస్తాడో, లేదో అనే అనుమానం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో కనిపిస్తోంది. 

సజ్జల భార్గవరెడ్డి పోలింగ్ అయిపోయిన 24 గంటల్లో పక్క రాష్ట్రానికి జెండా ఎత్తేశాడు. మొత్తం వైసీపీ సోషల్ మీడియా దుకాణం బంద్ అయిపోయింది. సజ్జలా... నీ కొడుకే ఇప్పుడు జెండా ఎత్తేశాడు! కానీ నిన్నటి మాటలతో కార్యకర్తలు, నేతల్లో ఆత్మవిశ్వాసం కలగకపోవడంతో, మళ్లీ ఇవాళ సజ్జల వచ్చి మీడియా ముందు అబద్ధాలు చెబుతున్నారు. 

రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లకు, కీలక స్థానాల్లో బాధ్యత కలిగిన అధికారులను నియమించకపోవడానికి సీఎస్ జవహర్ రెడ్డి బాధ్యత వహించాలి. ఆంజనేయులు, రఘురామిరెడ్డి, ధనంజయరెడ్డి, జవహర్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలకు ఊతమిస్తున్నారు. వీళ్ల మాటలు విని జగన్ రెడ్డి కళ్లలో ఆనందం చూడాలని ఏ అధికారులైతే తప్పుచేస్తున్నారో వారు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. 

ఆర్థిక శాఖలో సత్యనారాయణ కూడా పరిధి మంచి వ్యవహరిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక మీరు చేసిన పనులన్నీ సమీక్షించడం జరుగుతుంది. తప్పుచేసిన వాళ్లు జైళ్లపాలవుతారు. 

ఎక్కడ రాజంపేట... ఎక్కడ అనంతపురం జిల్లా... డీఎస్పీ చైతన్య దివ్యాంగుడిపై దాడి చేయడం దారుణం. దివ్యాంగుడు కిరణ్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నాడు. డీఎస్పీ చైతన్యను ఎందుకు సస్పెండ్ చేయకుండా సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ ఎందుకు కాపాడుతున్నారు? 

వైజాగ్ లో ఓటేయలేదని ముగ్గురిపై దాడి చేసి వాళ్ల తలలు పగులగొట్టారు. ఇవాళ్టికి కూడా మీ దుర్మార్గాలు ఆగడంలేదు. సజ్జలా, జవహర్ రెడ్డి, పోలీసుల అధికారులూ దీనికి ఏం సమాధానం చెబుతారు?" అంటూ దేవినేని ఉమా నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News