Amit Shah: 272 సీట్లు గెలవకుంటే బీజేపీ వద్ద ప్లాన్ 'బీ' ఉందా? అని అడిగితే అమిత్ షా సమాధానం ఇదీ...!

Does BJP have a plan B if it fails to cross majority mark in Lok Sabha polls

  • ప్లాన్ 'ఏ' సక్సెస్ రేటు 60 శాతం ఉందనీ.. ప్లాన్ 'బీ' అవసరం రాదనీ పేర్కొన్న అమిత్ షా
  • మోదీకి అండగా 60 కోట్ల లబ్ధిదారుల సైన్యం ఉందని వ్యాఖ్య
  • రాజ్యాంగాన్ని మార్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందని విమర్శ
  • పదేళ్లుగా తమకు బలం ఉన్నప్పటికీ రాజ్యాంగాన్ని మార్చలేదన్న అమిత్ షా

ప్రధాని నరేంద్ర మోదీకి 400 సీట్లు ఎందుకు ఇవ్వాలి? అనే విషయం ప్రజలకు తెలుసునని... ప్లాన్ 'ఏ' అనే తమ గెలుపు సక్సెస్ రేటు 60 శాతం ఉన్నప్పుడు ప్లాన్ 'బి' అవసరం లేదన్నారు. శుక్రవారం ఆయన ఓ జాతీయ ఛానల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా 'జూన్ 4న బీజేపీకి 272 సీట్లు రాకపోతే ఎలా? ప్లాన్ బీ ఏమిటి?' అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దానికి అమిత్ షా తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

తమకు ప్లాన్ 'బీ' పరిస్థితి రాదని ధీమా వ్యక్తం చేశారు. 60 కోట్ల లబ్ధిదారుల సైన్యం మోదీకి అండగా ఉందన్నారు. వారికి ఎలాంటి కులం, వయస్సుతో సంబంధం లేదన్నారు. మోదీ అంటే ఏమిటో... ఆయనకు 400 సీట్లు ఎందుకివ్వాలో ప్రజలకు తెలుసునన్నారు. తమ గెలుపు ఖాయమైనప్పుడు ప్లాన్ బీ ఎందుకు? అన్నారు. ప్రధాని మోదీ అఖండ మెజార్టీతో తిరిగి ప్రధాని కావడం ఖాయమన్నారు. తమకు గత పదేళ్లుగా రాజ్యాంగాన్ని మార్చడానికి కావాల్సిన బలం ఉందని, కానీ తాము ఎన్నడూ అలా చేయలేదన్నారు. రాజ్యాంగాన్ని మార్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందని మండిపడ్డారు.

ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్ ఎక్కడకు వెళ్లినా... ప్రజలకు మాత్రం మద్యం కుంభకోణమే గుర్తుకు వస్తుందన్నారు. ఇండియా కూటమి గెలిస్తే తాను జైలుకు వెళ్లనవసరం లేదని కేజ్రీవాల్ అన్నట్లుగా తాను నేరుగా వినలేదని అమిత్ షా తెలిపారు. ఆ మాటలు అని ఉంటే కనుక అంతకుమించిన ధిక్కారం మరొకటి ఉండదన్నారు. ఎన్నికల గెలుపోటముల ఆధారంగా కోర్టు నిర్ణయాలు తీసుకుంటుందా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News