RS Praveen Kumar: కేజ్రీవాల్‌కు బెయిల్ దొరికినప్పుడు కవితకు ఎందుకు రావడం లేదు?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

BRS leaders met the party MLC K Kavitha in Delhi Tihar Jail today
  • ఇతరుల పేర్లు చెప్పాలంటూ కవితపై ఈడీ, సీబీఐలు ఒత్తిడి చేస్తున్నాయన్న ప్రవీణ్ కుమార్   
  • తీహార్ జైల్లో ఆమె ధైర్యంగా ఉన్నారని వెల్లడి  
  • ఢిల్లీ ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి మద్యం పాలసీని తీసుకువచ్చిందన్న ఆర్ఎస్పీ

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు బెయిల్ దొరికినప్పుడు కవితకు ఎందుకు రావడం లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఇది చాలా దారుణమన్నారు. తీహార్ జైల్లో కవితను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మద్యం పాలసీ కేసులో ఇతర రాజకీయ నాయకుల పేర్లు వెల్లడించాలని కవితపై ఈడీ, సీబీఐల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉందని, ఈ విషయాన్ని ఆమె తమతో పంచుకున్నారన్నారు. ఇతర నాయకుల పేర్లు చెప్పాలని ఒత్తిడి తేవడం అనైతికం, చట్టవిరుద్ధం, రాజ్యాంగవిరుద్ధమని మండిపడ్డారు. తీహార్ జైల్లో ఆమె ధైర్యంగా ఉన్నారన్నారు.

ఈ కేసుతో తనకు సంబంధం లేదని, తాను నిర్దోషినని, అలాగే పిల్లల తల్లిని అని, తనపై అధికార పార్టీ రాజకీయ కుట్రతో ఇరికించిందని చెబుతూ కవిత బెయిల్ పిటిషన్ వేసిందని గుర్తు చేశారు. ఆమెపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7ను సీబీఐ ఎలా ప్రయోగించింది? అని ప్రశ్నించారు. హేమంత్ సోరెన్, మనీశ్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్‌లను కూడా అన్యాయంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. అదే కేసులో ఒకరికి బెయిల్ దొరికిన తర్వాత... కవిత బెయిల్‌ను విచారణ సంస్థలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయన్నారు.

కవితపై రాజకీయ కక్షతోనే మద్యం పాలసీ కేసులో ఇరికించారని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీబీఐ, ఈడీ వంటి విచారణ సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను అణచివేసే ప్రయత్నాలు చేస్తోందని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. ఈ కేసులో కవిత వద్ద ఒక్క రూపాయిని కూడా గుర్తించలేదన్నారు. మద్యం పాలసీ కేసు క్రైమే కాదన్నారు. తమ రెవెన్యూ పెంచుకోవడానికి ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకు వచ్చిందని, ఇందులో తప్పేముందన్నారు. అలాంటప్పుడు ఇందులో నేరం ఎక్కడ జరిగింది? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News