Crime News: డామిట్ కథ అడ్డం తిరిగింది.. ప్రియుడితో కలిసి భర్తను హత్యచేయించిన భార్య.. మనశ్శాంతి కరవై లొంగిపోయిన నిందితుడు

Wife killed husband with the help of boy friend in Hyderabad

  • హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడలో ఘటన
  • భర్తను హత్య చేయించి గుండెపోటుగా చిత్రీకరణ
  • అదే రోజు అంత్యక్రియలు
  • హత్య తర్వాత మనశ్శాంతి లేకుండా పోయిందంటూ పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు
  • మూడు నెలల తర్వాత అసలు విషయం వెలుగులోకి
  • అందరినీ లోపలేసిన పోలీసులు

ప్రియుడి మోజులో పడి భర్తను హత్యచేసిన భార్య.. గుండెపోటుతో మరణించాడని నమ్మించి అంత్యక్రియలు కూడా చేసేసింది. అంతా అనుకున్నట్టే జరగడంతో ఇక తమకు తిరుగులేదని, ప్రియుడితో కలిసి జీవితాన్ని హ్యాపీగా గడిపేయవచ్చని భావించింది. అయితే, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ప్రియురాలి భర్తను హత్యచేసిన దగ్గరి నుంచి మనశ్శాంతి కరవై నిద్రకు దూరమైన నిందితుడు ఇక తనవల్ల కాదని పోలీసులకు లొంగిపోయాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో జరిగిందీ ఘటన.

మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిగూడ జయప్రకాశ్‌నగర్‌లోని శిఖర అపార్ట్‌మెంట్స్‌లో నివసించే విజయకుమార్ (40) సీసీ కెమెరా టెక్నీషియన్. భార్య, శ్రీలక్ష్మి (33), 8,9 ఏండ్ల వయసున్న ఇద్దరు అబ్బాయిలతో కలిసి ఉన్నంతలో హ్యాపీగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీలక్ష్మికి బోరబండకు చెందిన రాజేశ్ (33)తో జరిగిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. తమ మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని భావించి అతడిని హత్యచేసేందుకు ప్రియుడితో కలిసి పథక రచన చేసింది. భర్త హత్య తర్వాత ఆయన పేరిట మేడ్చల్, ఎల్లారెడ్డిగూడలో ఉన్న ఇళ్లను అమ్మేసి ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేయాలని భావించింది. 

ఈ క్రమంలో వి.రామారావునగర్‌కు చెందిన పటోళ్ల రాజేశ్వర్‌రెడ్డి, ఎండీ మెహ్తాబ్ అలియాస్ బబ్బన్‌ను సంప్రదించిన రాజేశ్ సుపారీ ఇచ్చి హత్యకు ప్లాన్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన భర్తను ఇంట్లోనే హత్య చేశారు. ఆపై శవాన్ని బాత్రూములో పడేసి గుండెపోటుకు గురై మరణించినట్టు నమ్మించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అదే రోజు అంత్యక్రియలు కూడా పూర్తిచేసింది.

హత్య చేసినప్పటి నుంచి నిందితుల్లో ఒకరైన రాజేశ్వర్‌రెడ్డికి మనశ్శాంతి లేకుండా పోయింది. దీంతో మంగళవారం రాత్రి అతడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. రాజేశ్‌ది హత్య కాదని, తామే హత్య చేశామని అంగీకరించాడు. అతడిచ్చిన సమాచారంతో శ్రీలక్ష్మి, రాజేశ్‌, బబ్బన్‌లను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News