Pawan Kalyan: వర్మ సహకారం మరువలేనిది.... సినీ కుటుంబ సభ్యుల ప్రేమ కదిలించింది: పవన్ కల్యాణ్

Pawan Kalyan thanked SVSN Varma and Cine people

  • పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన పవన్
  • రికార్డు స్థాయిలో 86.63 శాతం ఓటింగ్ నమోదైందన్న పవన్ 
  • వర్మ తన కోసం సీటు త్యాగం చేశారని కొనియాడిన జనసేనాని
  • సినీ, టీవీ నటులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకటన

జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా, ఇప్పుడాయన భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పిఠాపురం జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన తనను ఆదరించి, అండగా నిలిచి, ప్రేమను చూపించిన పిఠాపురం ప్రజానీకానికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ పవన్ ఓ ప్రకటనలో తెలిపారు. 

"పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని ప్రకటించగానే స్వచ్ఛందంగా తరలివచ్చి మీ కుటుంబ సభ్యుడిలా భావించి పనిచేయడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈసారి ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా రాత్రి 10 గంటల వరకు పోలింగ్ లో పాల్గొని, రికార్డు స్థాయిలో 86.63 శాతం ఓటింగ్ నమోదు అయ్యేందుకు కారకులయ్యారు. తద్వారా మీ ప్రేమను చాటుకున్నారు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జనసైనికులు, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు వ్యవహరించిన తీరు అభినందనీయం. 

నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని తెలియగానే ఎంతో బలమైన క్యాడర్ ను కలిగి ఉన్నప్పటికీ ఎస్వీఎస్ఎన్ వర్మ తన సీట్ ను నా కోసం త్యాగం చేశారు. వర్మ, టీడీపీ కార్యకర్తలు నాకు సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. అందుక వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఎన్నికల్లో వర్మ అందించిన సహకారం మరువలేనిది. భవిష్యత్ లో ఆయన కచ్చితంగా చట్టసభల్లో అడుగుపెట్టి ప్రజల తరఫున బలంగా పనిచేస్తారని నమ్ముతున్నాను. రానున్న రోజుల్లో వర్మ అనుభవం వినియోగించుకుంటూ కలిసికట్టుగా ముందుకెళతాం. 

ఇక, పిఠాపురంలో నేను పోటీ చేస్తున్నాను అని తెలియగానే తమ సినీ కుటుంబ సభ్యుడికి అండగా ఉండేందుకు తమ సినిమాలు, సీరియళ్లకు గ్యాప్ ఇచ్చి ముందుకు వచ్చి పిఠాపురంలో ప్రతి గడపకు వెళ్లి ప్రచారం చేసిన సినీ, బుల్లితెర నటీనటుల ప్రేమ నన్ను కదిలించింది. నా విజయం కాంక్షిస్తూ ఎంతోమంది అగ్ర హీరోల నుంచి నవతరం నటుల వరకు అందరూ మద్దతు పలకడం సంతోషాన్నిచ్చింది. ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 

అలాగే, దేశవిదేశాల నుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తరలివచ్చి తమ మాతృభూమి అభివృద్ధి ఆకాంక్షను వెల్లడించిన ఎన్నారై జనసైనికులకు నా అభినందనలు" అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News