Sunil Chhetri: ఫుట్‌బాల్‌కు భారత దిగ్గజం సునీల్ ఛెత్రీ వీడ్కోలు.. జూన్ 6న చివరి మ్యాచ్

Indian Football Star Sunil Chhetri Announces Retirement

  • 19 ఏళ్ల సదీర్ఘ కెరియర్‌లో ఎన్నో రికార్డులు సాధించిన ఛెత్రీ
  • నిర్ణయం బాధాకరమే అయినా తప్పలేదన్న కెప్టెన్
  • దేశం కోసం ఆడిన ప్రతి మ్యాచ్‌ను ఎంజాయ్ చేశానన్న కెప్టెన్
  • అత్యధిక గోల్స్ సాధించిన భారత ఆటగాడిగా ఛెత్రీ రికార్డు

భారత్‌లో ఫుట్‌బాల్‌కు పర్యాయ పదంగా మారిన సునీల్ ఛెత్రీ (39) అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గురువారం వీడ్కోలు ప్రకటించాడు.  జూన్ 6న కోల్‌కతాలో కువైట్‌తో జరగనున్న ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ తనకు చివరిదని పేర్కొన్నాడు. రెండు దశాబ్దాల కెరియర్‌లో భారత్‌ జట్టుకు అత్యధిక కాలం కెప్టెన్‌గా వ్యవహరించిన ఛెత్రీ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. క్వాలిఫయర్స్‌లో గ్రూప్-ఎలో నాలుగు పాయింట్లతో భారత్‌ రెండో స్థానంలో ఉండగా, ఖతర్ అగ్రస్థానంలో ఉంది. 

ఈ 19 ఏళ్ల కెరియర్‌‌లో జ్ఞాపకాలు కర్తవ్యం, ఒత్తిడి, అపారమైన ఆనందం కలయిక అని ఛెత్రీ గుర్తుచేసుకున్నాడు. దేశం కోసం ఇన్ని మ్యాచ్‌లు ఆడతానని ఎప్పుడూ అనుకోలేదన్నాడు. మంచి, చెడు కోసం తానెప్పుడూ ఆడలేదని, దేశాన్ని గెలిపించేందుకే ఆడానని వివరించాడు. దేశం కోసం ఆడిన ప్రతి మ్యాచ్‌ను ఎంజాయ్ చేశానన్న చెత్రీ.. కువైట్‌తో మ్యాచ్ చాలా ఒత్తిడితో కూడుకున్నదని, తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించేందుకు తమకు మూడు పాయింట్లు అవసరమని పేర్కొన్నాడు. రిటైర్మెంట్ నిర్ణయం బాధాకరమే అయినా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు.

మార్చిలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తో ఛెత్రీకి 150వ మ్యాచ్. గువాహటిలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 1-2తో ఓటమి పాలైంది. 2005లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన ఛెత్రీ 94 గోల్స్ సాధించి ఇండియా ఆల్ టైమ్ టాప్ స్కోరర్‌గా రికార్డులకెక్కాడు. అంతేకాదు, ప్రస్తుత ఆటగాళ్లలో దిగ్గజాలైన క్రిస్టియానో రోనాల్డో, లియోనల్ మెస్సీ తర్వాత అత్యధిక గోల్స్ సాధించిన మూడో ఆటగాడిగా రికార్డు సాధించాడు.

More Telugu News