Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ రేసు నుంచి తప్పుకున్న మరో దిగ్గజం?
- ఆసక్తికరంగా మారిన టీమిండియా హెడ్ కోచ్ ఎంపిక
- తెరపైకి వీవీఎస్ లక్ష్మణ్, స్టీఫెన్ ఫ్లెమింగ్, రికీ పాంటింగ్ పేర్లు
- రేసులో వీవీఎస్ లక్ష్మణ్ లేనట్టు తాజాగా జాతీయ మీడియాలో కథనాలు
టీమిండియా హెడ్ కోచ్ ఎంపిక రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. రాహుల్ ద్రావిడ్ తరువాత కోచ్ బాధ్యతలు ఎవరు చేపడతారనేది ఆసక్తికరంగా మారింది. హెడ్ కోచ్ బాధ్యతలపై తనకు ఇక ఆసక్తి లేదని రాహుల్ ద్రావిడ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మరో క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ పేరు తెరపైకి వచ్చింది. అయితే, వీవీఎస్ లక్ష్మణ్ కూడా కోచ్ రేసులో లేనట్టు జాతీయ మీడియా చెబుతోంది.
ఇక హెడ్ కోచ్ పదవికి విదేశీయుడిని ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే బీసీసీఐ వర్గాలు సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను సంప్రదించినట్టు కథనాలు వెలువడ్డాయి. కోచ్‌గా ఫ్లెమింగ్ సీఎస్‌కేకు రికార్డు స్థాయిలో ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించాడు. ఇక టీమిండియా తదుపరి కోచ్‌పై భారత్‌ను 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2027 వన్లే వరల్డ్ కప్‌లో విజేతగా నిలపాల్సిన గురుతర బాధ్యత ఉంటుంది. ఈ పరిస్థితుల్లో టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతకు ఫ్లెమింగ్ తగినవాడని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం.
అయితే, ఈ కథనాలను సీఎస్‌కే సీఈఓ కాశీవిశ్వనాథన్ ఖండించారు. ‘‘ఈ విషయమై తనకు ఎలాంటి సమాచారం అందలేదు. స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా తమకు ఏమీ చెప్పలేదు’ అని పేర్కొన్నారు. మరోవైపు, టీమిండియా హెడ్ కోచ్ రేసులో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.