Sachin Tendulkar: సచిన్ సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య!
- తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రకాశ్ కాప్డే
- సచిన్ వీవీఐపీ సెక్యూరిటీలో విధులు నిర్వర్తిస్తున్న కాప్డే
- వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసుల అనుమానం
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది ఒకరు తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడటం కలకలం సృష్టిస్తోంది. స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్ అయిన ప్రకాశ్ కాప్డే (39).. సచిన్ వీవీఐపీ సెక్యూరిటీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన ఇటీవలే విధులకు సెలవు పెట్టి స్వగ్రామానికి వెళ్లాడు. ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటున్నాడు.
ఈ క్రమంలో బుధవారం ఉదయం తన వద్ద ఉన్న సర్వీస్ గన్‌తో మెడపై కాల్చుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రకాశ్ అప్పటికే మృతి చెందాడు. ప్రకాశ్ ఆత్మహత్యపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
కాగా, వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రకాశ్ తల్లిదండ్రులు, భార్యా పిల్లలు, సన్నిహితులు, స్నేహితులను ప్రశ్నిస్తున్నారు. వీవీఐపీ సెక్యూరిటీ సిబ్బంది ఆత్మహత్యకు పాల్పడటంతో ఎస్ఆర్‌పీఎఫ్ కూడా దర్యాప్తు చేస్తోంది.