Saudi Arabia: ఒక్క మలుపు కూడా లేకుండా 256 కి.మీ. పొడవైన హైవే!

This Country Has A 256 Kilometre Highway That Never Bends

  • ప్రపంచంలోనే అతి పొడవైన నిటారు రోడ్డుగా సౌదీ అరేబియలోని హైవే 10 సరికొత్త రికార్డు
  • రబ్ అల్ ఖీ ఎడారిలో నిర్మాణం.. రెండు గంటల్లోనే గమ్యం చేరుకొనే వీలు
  • ఆస్ట్రేలియాలోని ఐర్ హైవే పేరిట ఉన్న 146 కి.మీ. దూరంపాటు మలుపుల్లేని రికార్డు బ్రేక్

హైవేలపై కొంత దూరం వరకు మలుపులు లేని ప్రయాణం ఉండటం సాధారణంగా కనిపించే దృశ్యమే. కానీ సౌదీ అరేబియాలో మాత్రం అసాధారణ స్థాయిలో కొన్ని వందల కిలోమీటర్ల దూరంపాటు మలుపులు లేకుండా నిటారుగా ఒక హైవే ఉంది!

రబ్ అల్ ఖలీ ఎడారి మీదుగా నిర్మించిన హైవే 10 లో ఏకంగా 256 కిలోమీటర్ల దూరం వరకు ఒక్క మలుపు కూడా లేదట! చమురు, గ్యాస్ నిల్వల నగరమైన హరద్ నుంచి పొరుగునున్న యూఏఈ సరిహద్దు ప్రాంతం అల్ బతా వరకు ఉన్న ఈ హైవే పూర్తిగా నిటారుగానే ఉంటుందని అరబ్ న్యూస్ సంస్థ తెలిపింది.

ఇప్పటివరకు ఆస్ట్రేలియాలోని ఐర్ హైవే (146 కి.మీ.) పేరిట ఉన్న ప్రపంచంలోనే అతిపొడవైన నిటారు రోడ్డు రికార్డును సౌదీలోని హైవే 10 బద్దలు కొట్టినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. దేశ రాజు అబ్దుల్లా కోసం తొలుత దీన్ని ప్రైవేటు రోడ్డుగా ఇలా ప్రత్యేకంగా నిర్మించారట. అయితే ప్రస్తుతం చమురు రవాణాకు దీన్ని వినియోగిస్తున్నారు. 

ఈ హైవే నిటారుగా ఉండటమే కాదు.. మొత్తం 256 కి.మీ. మార్గంలో ఎత్తుపల్లాలు కూడా ఉండవని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ వెల్లడించింది. అలాగే ఈ దారిలో ఎక్కడా ఒక్క చెట్టు లేదా కట్టడం కూడా కనిపించదు.

దీంతో ఈ రోడ్డుపై వాహనాలు కేవలం 2 గంటల వ్యవధిలోనే 256 కి.మీ. దూరం వరకు దూసుకెళ్లగలవట! అయితే అక్కడక్కడా ఒంటెలు, కంగారూలు మాత్రం ఉన్నట్టుండి రోడ్డు దాటుతుంటాయని.. అందువల్ల వాహనదారులు జాగ్రత్తగా నడపకపోతే ప్రమాదాలు తప్పవని dangerousroads.org అనే వెబ్ సైట్ హెచ్చరించింది.

  • Loading...

More Telugu News