KTR: మేడిగడ్డ, శ్వేతపత్రాలు, ఫోన్ ట్యాపింగ్ అంశాలతో కాంగ్రెస్ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేసింది: కేటీఆర్

KTR blames congress for issues in lok sabha elections

  • ఇండియా, ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితి లేదన్న కేటీఆర్
  • కాంగ్రెస్ ఐదు నెలలు టైంపాస్‌గా ప్రభుత్వాన్ని నడిపిందని విమర్శలు
  • ఎప్పుడైనా తెలంగాణ ప్రయోజనాలకు బీఆర్ఎస్ శ్రీరామరక్ష అన్న కేటీఆర్

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ, శ్వేతపత్రాలు, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలు తీసుకొని ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలే హ‌వా కొనసాగించబోతున్నాయన్నారు. ఇండియా, ఎన్డీఏ కూట‌మిల‌కు స్ప‌ష్ట‌మైన మెజార్టీ వ‌చ్చే పరిస్థితి లేదన్నారు.

ఇండియా, ఎన్డీఏ కూట‌మిలో లేని పార్టీలు.. బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, బిజూ జ‌న‌తాద‌ళ్ వంటి ప్రాంతీయ శ‌క్తులే కేంద్రంలో నిర్ణ‌యాత్మ‌క పాత్ర పోషిస్తాయన్నారు. కాంగ్రెస్ ఐదు నెల‌లు టైం పాస్‌గా ప్రభుత్వాన్ని నడిపిందన్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌ట్ల అవ‌గాహ‌న లేకుండా అన్ని చిల్ల‌ర‌మ‌ల్ల‌ర అంశాలు తీసుకొని రాజకీయాలు చేసిందని విమర్శించారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో గులాబీ సైనికులు అద్భుత‌మైన పోరాట ప‌టిమ ప్ర‌ద‌ర్శించారన్నారు. లోక్ సభ ఎన్నిక‌ల్లో మంచి ఫ‌లితాలు సాధించ‌బోతున్నామని... తెలంగాణ ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ అత్య‌ధిక స్థానాల్లో గెల‌వ‌బోతుందన్నారు.

ఈనాడైనా ఏనాడైనా బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌కు శ్రీరామ‌ర‌క్ష అని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైందన్నారు. ఆ రెండు పార్టీలు స‌న్నాయి నొక్కులు నొక్క‌డానికి, విమ‌ర్శ‌లు చేయ‌డానికి, కేసీఆర్‌ను దూషించ‌డానికి ప‌రిమితం అయ్యాయని మండిపడ్డారు. తెలంగాణ‌కు ఏం చేయ‌క‌పోయినా అడ్డ‌గోలు విమ‌ర్శ‌లు చేశాయన్నారు. వీరి వ‌ల్ల ఏం కాద‌ని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైపోయిందని, ఈ ఎన్నిక‌ల్లో చేసిన కృషి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు పునాది కాబోతుందన్నారు. 

ఈ ఎన్నిక‌ల త‌ర్వాత కాంగ్రెస్ పార్టీకి అయితే ప‌రిస్థితి బాగుండ‌దని జోస్యం చెప్పారు. ఈ ఐదు నెల‌ల్లోనే ఎక్క‌డలేని వ్య‌తిరేక‌త‌ను అది మూట‌గ‌ట్టుకుందన్నారు. ఐదు నెల‌ల్లోనే అసాధార‌ణ వ్య‌తిరేక‌త వ‌చ్చిందని, క్షేత్ర స్థాయిలో బాగాలేదన్నారు. అడ్డ‌గోలు హామీలిచ్చి నెర‌వేర్చ‌లేద‌నే కోపంతో ప్ర‌జ‌లు ఉన్న‌ట్లు చెబుతున్నారని తెలిపారు. ఈ ఎన్నిక‌ల త‌ర్వాత అయినా కాంగ్రెస్ బుద్ది తెచ్చుకొని 420 హామీలు అమ‌లు చేయ‌క‌పోతే ప్ర‌జాక్షేత్రంలో ప‌రాభ‌వం త‌ప్ప‌దు హెచ్చ‌రించారు.

  • Loading...

More Telugu News