Chandrababu: చంద్రబాబునాయుడిపై కేసు కొట్టివేసేందుకు బాంబే హైకోర్టు నిరాకరణ

Bombay High Court refuses to quash case against N Chandrababu Naidu

  • ఓ నిరసనకు సంబంధించి చంద్రబాబు, ఆనందబాబు, మరో 66 మందిపై ధర్మాబాద్‌లో కేసు నమోదు
  • ఔరంగాబాద్ సెంట్రల్ జైలుకు తరలించే క్రమంలో జైలు సిబ్బందిపై దాడిచేశారని కేసు నమోదు
  • కేసును కొట్టివేయడం సముచితం కాదన్న ఔరంగాబాద్ బెంచ్

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేత నక్కా ఆనందబాబుపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేసేందుకు బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ బెంచ్ నిరాకరించింది. 2010లో ఓ నిరసనకు సంబంధించి చంద్రబాబు, ఆనందబాబును ఔరంగాబాద్ సెంట్రల్ జైలుకు తరలించే క్రమంలో జైలు సిబ్బందిపై వారు దాడిచేసినట్టు క్రిమినల్ కేసు నమోదైంది. తాజాగా, ఈ కేసును విచారించిన జస్టిస్ మంగేశ్ పాటిల్, జస్టిస్ శైలేశ్ బ్రహ్మేలతో కూడిన ధర్మాసనం.. నేరారోపణలో నిందితుల ప్రమేయాన్ని బయటపెట్టేందుకు తగిన ఆధారాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదని అభిప్రాయపడింది.

ఘటన జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, గాయపడిన పోలీసు సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారని, దీనినిబట్టి నేరానికి సంబంధించి తగిన సమాచారం ఉన్నట్టేనని, కాబట్టి కేసును కొట్టివేయడం సముచితం కాదని ధర్మాసనం పేర్కొంది. నిందితులపై కేసు నమోదు, దర్యాప్తు వంటి వాటిలో చట్టవిరుద్ధంగా ప్రవర్తించినట్టు తమకు అనిపించలేదని పేర్కొంది.  

అయితే, 13 సెప్టెంబర్ 2023న చంద్రబాబుకు మంజూరు చేసిన మధ్యంతర ఉపశమనాన్ని జులై 8 వరకు పొడిగించింది. ఫలితంగా ట్రయల్ కోర్టు ఎదుట హాజరుకాకుండా చంద్రబాబుకు మినహాయింపు లభించింది. కాగా జులై 2010లో చంద్రబాబు, ఆనందబాబు, మరో 66 మందిపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

More Telugu News