Sushil Kumar Modi: బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ కన్నుమూత!
- గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న సుశీల్ కుమార్ మోదీ
- న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి
- దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ కన్నుమూశారు. ఈ విషయాన్ని బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా సోమవారం రాత్రి ఎక్స్ (ట్విటర్) వేదికగా తెలియజేశారు. కాగా, ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో రాత్రి 9.45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని, ఈసారి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేనని సుశీల్ కుమార్ మోదీ గత నెలలో ప్రకటించారు.
"బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, రాజ్యసభ మాజీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ మరణ వార్తతో బీజేపీ ఫ్యామిలీ తీవ్ర విచారంలో ఉంది" అని పార్టీ రాష్ట్ర యూనిట్ ట్వీట్ చేసింది. బీహార్, మొత్తం బీజేపీ కుటుంబానికి ఇది కోలుకోలేని నష్టం అని తన ట్వీట్‌లో పేర్కొంది.
ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి
బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం తనను తీవ్రంగా కలిచి వేసిందని ట్వీట్ చేశారు. "సుశీల్ మోదీ జీ అకాల మరణం చాలా బాధ కలిగించింది. పార్టీలో నా విలువైన సహచరుడు. దశాబ్దాలుగా నా మిత్రుడు. బీహార్‌లో బీజేపీ ఎదుగుదల, విజయంలో ఆయన ఎనలేని పాత్ర పోషించారు" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.