Sumatra Island: ఇండోనేషియాలోని సుమిత్రా దీవిలో మెరుపు వరదలు.. ముంచెత్తిన ‘కోల్డ్‌లావా’.. 37 మంది మృతి
- భారీ వర్షాల కారణంగా మౌంట్ మరాపి నుంచి వెల్లువెత్తిన కోల్డ్ లావా
- నాలుగు జిల్లాలను ముంచెత్తిన నది
- కొట్టుకుపోయిన వందకుపైగా ఇళ్లు, భవనాలు
- ఇప్పటి వరకు 19 మృతదేహాల వెలికితీత
- రెండు నెలల క్రితం భారీ వర్షాలు, వరదల కారణంగా 21 మంది మృతి
అకస్మాత్తు వరదలు, కోల్డ్ లావా (అగ్నిశిలలు) ముంచెత్తడంతో ఇండోనేసియాలోని సుమత్రా దీవిలో 37 మంది మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో కనిపించకుండా పోయారు. రుతుపవన వర్షాలు, మౌంట్ మరాపి నుంచి వెల్లువెత్తిన కోల్డ్ లావా ప్రవాహం కారణంగా నది బద్దలై పశ్చిమ సుమిత్రా ప్రావిన్సులోని నాలుగు జిల్లాలను శనివారం అర్ధరాత్రి ముంచెత్తింది. అకస్మాత్తుగా దూసుకొచ్చిన వదరలో ప్రజలు కొట్టుకుపోయారు. వందకిపైగా ఇళ్లు, భవనాలు మునిగిపోయినట్టు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
కోల్డ్ కోవాను లహర్‌గా కూడా పిలుస్తారు. ఇది అగ్నిపర్వత పదార్థాలు, గులకరాళ్ల మిశ్రమంతో తయారవుతుంది. వర్షాల సమయంలో అగ్నిపర్వత వాలు ప్రాంతాల గుండా కిందికి చేరుతుంది. ఆదివారం మధ్యాహ్నం నాటికి రెస్క్యూ సిబ్బంది 19 మృతదేహాలను వెలికి తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అదృశ్యమైన 18 మంది కోసం గాలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, రెండు నెలల క్రితమే పశ్చిమ సుమ్రతాలోని పెసిసిర్ సెలాటన్, పడాంగ్ పరియమన్ జిల్లాల్లో భారీ వర్షాలు, అకస్మాత్తు వరదల కారణంగా 21 మంది మృతి చెందారు. ఐదుగురు కనిపించకుండా పోయారు. అంతలోనే దీవిని మరోమారు ఫ్లాష్‌ఫ్లడ్స్ ముంచెత్తి మరికొందరిని బలితీసుకున్నాయి.