vote: ఓటు వేయకపోతే.. రేషన్ కట్.. జరిమానా కూడా?
- జనమంతా తప్పనిసరిగా ఓటేసేలా పలు ప్రభుత్వాల చర్యలు
- కొన్నిచోట్ల నామమాత్రపు జరిమానాలు.. కొన్నిచోట్ల జైలు శిక్ష
- లేకుంటే ఓటు ఎందుకు వేయలేదో వివరణ ఇవ్వాల్సిన వైనం
లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా జరుగుతోంది. పోలింగ్ రోజున కచ్చితంగా సెలవు ఇవ్వాలన్న ఎన్నికల సంఘం ఆదేశంతో చాలా కంపెనీలు సెలవులు ఇచ్చేశాయి. అదీ పోలింగ్ సోమవారం, దానికి ముందు ఆదివారం కూడా కలసి రావడంతో.. చాలా మంది ఎంటర్ టైన్‌మెంట్ కు ప్లాన్ చేసుకున్నారు. ఓటేస్తే వేద్దాం.. లేకుంటే సెలవును ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా కొందరు వ్యవహరిస్తున్నారు. అదే ఓటేయకుంటే.. ఏదైనా శిక్షగానీ, ఫైన్ గానీ విధిస్తే ఎలా ఉంటుంది? మన దగ్గర లేదుగానీ.. కొన్ని దేశాల్లో ఓటేయకుంటే శిక్షలు తప్పవు. అవేంటో చూద్దామా..
- అర్జెంటీనా: ఇక్కడ ఓటు వేయనివారు ఎందుకు వేయలేదనే కారణంతో ప్రభుత్వానికి వివరణ ఇవ్వాల్సిందే. దానిపై అధికారులు సంతృప్తి చెందితే వదిలేస్తారు. లేకుంటే ఫైన్ కట్టాల్సి వస్తుంది.
- పెరూ: ఈ దేశంలో ఎన్నికలు జరిగిన తర్వాత ఓటేసినట్టుగా స్టాంప్ వేసిన కార్డు ఇస్తారు. ఆ కార్డు చూపితేనే ప్రభుత్వం నుంచి రేషన్ సరుకులు, సేవలు అందుతాయి. లేకుంటే రేషన్ లేనట్టే. అంతేకాదు ఓటేయకుంటే కాస్త జరిమానా కూడా కట్టక తప్పదు.
- సింగపూర్: ఇక్కడ ఓటేయనివారి పేర్లను వెంటనే ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు. అలాంటి వారు ఏ ఎన్నికల్లో కూడా పోటీ పడటానికి చాన్స్ లేకుండా పోతుంది. అయితే వివరణ పత్రం రాసిచ్చి, కొంత ఫీజు కట్టి దరఖాస్తు చేసుకుంటే.. ఓటర్ల జాబితాలో తిరిగి నమోదు చేస్తారు.
- బెల్జియం: ఇక్కడ జనం ఓటేయకుంటే.. స్వల్పంగా జరిమానా కట్టాల్సి ఉంటుంది. అదే నాలుగు ఎన్నికల్లో గానీ ఓటేయకపోతే.. జైలుకు వెళ్లక తప్పదు.
- ఉత్తర కొరియా: పూర్తిగా నియంతృత్వ రాజ్యమైన ఈ దేశంలో పరిస్థితి మరీ దారుణం. ఫెడరల్ ఎన్నికల్లో అందరూ తప్పనిసరిగా ఓటేయాల్సిందే. లేకుంటే దేశ ద్రోహంగా పరిగణించి శిక్షలు విధిస్తారు.
- ఆస్ట్రేలియా: ఈ కంట్రీలో ఓటర్లు కచ్చితంగా ఓటేయాల్సిన పోలింగ్ ప్రాంతానికి చేరుకోవాల్సిందే. అక్కడికి వెళ్లాక వారు ఓటు వేయొచ్చు, వేయబోమని చెప్పొచ్చు. కానీ పోలింగ్ ప్రాంతానికి వెళ్లకుంటే మాత్రం.. రూ.2.5 వేల వరకు జరిమానా కట్టాలి. ఆ ఫైన్ కట్టకుంటే జైలుశిక్ష అనుభవించాల్సి వస్తుంది.
- బ్రెజిల్: ఈ దేశంలో 16 ఏళ్లకే ఓటు హక్కు వస్తుంది. ఎన్నికల్లో 16 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వారు, 70 ఏళ్లు దాటిన వారు కచ్చితంగా ఓటేయాలన్న రూలేమీ లేదు. మిగతా అందరూ ఓటేయాల్సిందే. లేకపోతే జరిమానా కట్టాల్సి వస్తుంది.
- నౌరూ, ఉరుగ్వే, టర్కీ, లీచెన్ స్టీన్, లగ్జెంబర్గ్ తదితర దేశాల్లో ఓటేయనివారు తగిన వివరణ ఇవ్వాలి. అది సరిగా లేకుంటే జరిమానా కట్టాల్సి వస్తుంది.
మరెన్నో దేశాల్లోనూ కంపల్సరీ
ఇవేగాక.. బొలీవియా, బల్గేరియా, కోస్టారికా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, డొమినికన్ రిపబ్లిక్, ఈజిప్ట్, గ్రీస్, హొండూరాస్, ఇటలీ, లెబనాన్, లిబియా, మెక్సికో, పనామా, పరాగ్వే, థాయిలాండ్ వంటి దేశాల్లోనూ కంపల్సరీ ఓటింగ్ వ్యవస్థ ఉంది. కాకపోతే.. ఓటేయని వారిని స్వల్ప హెచ్చరికలతో వదిలేస్తారు. పెద్దగా ఫైన్లు, శిక్షలు ఉండవు.
కొన్ని మినహాయింపులు ఉంటాయి
ఓటు వేయకపోతే చర్యలు తీసుకునే దేశాల్లో కొన్ని మినహాయింపులు మాత్రం అమలు చేస్తారు. తీవ్ర అనారోగ్యం, వయసు మీదపడటం, మిలటరీ విధుల్లో ఉండటం, కీలకమైన మతపరమైన అంశాలు కావడం వంటి మినహాయింపులు ఉంటాయి.