General Elections-2024: రేపు దేశవ్యాప్తంగా నాలుగో దశ ఎన్నికలు... ఏపీ, తెలంగాణల్లో పోలింగ్ కు సర్వం సిద్ధం

All set for fourth phase elections including AP and Telangana

  • 9 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలో ఎన్నికలు
  • మొత్తం 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు
  • ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు

దేశంలో రేపు (మే 13) నాలుగో విడత సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 9 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నాలుగో విడతలో ఏపీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, కశ్మీర్ లో ఎన్నికలు చేపడుతున్నారు. అదే సమయంలో ఏపీ, ఒడిశా అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. 

నాలుగో విడత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 1,717 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 1.92 లక్షల పోలింగ్  కేంద్రాల్లో 17.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు... తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు నాలుగో విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల కోసం తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 

తెలంగాణలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియలో 2.80 లక్షల మంది సిబ్బంది పాలుపంచుకుంటున్నారు. ఈసీ 364 మంది ఎన్నికల పరిశీలకులను  నియమించింది. 73,414 మంది పోలీసులను మోహరించారు. 500 తెలంగాణ స్పెషల్ ఫోర్స్ బలగాలు, 164 కేంద్ర బలగాలు, 7 వేల మంది ఇతర రాష్ట్రాల హోంగార్డులతో తెలంగాణలో భద్రత కల్పిస్తున్నారు. 

ఏపీలో ఎన్నికల విధుల్లో 1.06 లక్షల మంది పాలుపంచుకుంటున్నారు. 34 వేలకు పైగా పోలింగ్  కేంద్రాల్లో ఎక్కడిక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 14 నియోజకవర్గాలను సమస్యాత్మకం/సున్నితమైనవిగా భావించి వెబ్ కాస్టింగ్ పరిధిలోకి తీసుకువచ్చారు. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4.14 కోట్లు. రాష్ట్రవ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

అసెంబ్లీకి 2,387 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, లోక్ సభ బరిలో 454 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఏపీలో ఈసారి సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి (లోక్ సభ), సుజనా చౌదరి, రఘురామకృష్ణరాజు, సీఎం రమేశ్ (లోక్ సభ), నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (లోక్ సభ) వంటి ప్రముఖులు పోటీ చేస్తుండడం తెలిసిందే.

  • Loading...

More Telugu News