Japan: ఒక్క కారుకు దారిచ్చేందుకు ఆగిన పదుల వాహనాలు! జపనీయుల సహనానికి నెటిజన్ల ఫిదా
- షాపింగ్ సెంటర్ నుంచి రోడ్డెక్కేందుకు వచ్చిన ఎస్ యూవీ
- సెక్యూరిటీ సిబ్బంది చేయి చూపగానే ఆగిన వాహనదారులు
- ఆగినందుకు వారికి శిరస్సు వంచి నమస్కరించిన సిబ్బంది
మన దేశంలో వాహనదారుల సంగతి తెలిసిందేగా.. ట్రాఫిక్ పోలీసులు లేకపోతే రెడ్ సిగ్నల్ పడ్డా ఆగరు. ఇతరులకు సైడ్ ఇమ్మన్నా ఓ పట్టాన ఇవ్వరు. కానీ ట్రాఫిక్ నిబందనలను పాటించే విషయంలో జపనీయుల సహనానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఓ షాపింగ్ కేంద్రంలోంచి రోడ్డెక్కేందుకు వచ్చిన ఓ కారు కోసం పదుల సంఖ్యలో వాహనదారులు ఓపికగా నిరీక్షించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఆ వీడియోలో ఓ బ్లాక్ ఎస్ యూవీని రోడ్డెక్కించేందుకు వీలుగా కాస్త ఆగాలంటూ సెక్యూరిటీ సిబ్బంది వాహనదారులకు చేయి చూపించారు. దీంతో రోడ్డుపై వస్తున్న వాహనదారులంతా ఆగారు. హారన్లు కొట్టకుండా ఆ కారు వెళ్లే దాకా నిరీక్షించారు. సెక్యూరిటీ సిబ్బంది తొలుత ఎస్ యూవీలోని వ్యక్తికి తల వంచి నమస్కరించారు. కొన్ని క్షణాలపాటు నిరీక్షించినందుకు ఇతర వాహనదారులకు కూడా అదే విధంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
జపాన్ వాహనదారుల మంచితనాన్ని తెలియజేసే వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. రోడ్డు దాటే ఓ బాలుడి కోసం ఓ వాహనదారుడు ఎంత ఓపికగా నిరీక్షించాడో తెలియజేశాయి. అలాగే నిబంధనలను పాటిస్తూ క్రమశిక్షణతో జపనీయులు మెట్లు ఎక్కే వీడియో కూడా నెటిజన్ల మనసు దోచుకుంది.
జపాన్ లో కస్టమర్ సర్వీస్ ఇలా ఉంటుందని ఓ యూజర్ పోస్ట్ చేయగా జపనీయుల పరస్పర గౌరవభావం చూస్తే ముచ్చటేస్తోందని మరొకరు కామెంట్ చేశారు. దూకుడు స్వభావం, స్వార్థ బుద్ధితో నిండిపోయిన అమెరికా సమాజంలో జీవించేకన్నా మర్యాదతో మెలిగే జపాన్ లో ఉండటం ఎంతో ఉత్తమం అంటూ మరో యూజర్ అభిప్రాయపడ్డాడు.