USA: అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృత్యువాత

two Telugu students Died in USA

  • ఆరిజోనాలోని జలపాతంలో మునిగి మృతి
  • ఇటీవల ఎంఎస్ పట్టా పొందిన విద్యార్థులు
  • చదువు పూర్తయిన సంతోషంలో స్నేహితులతో కలిసి జలపాతానికి
  • ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిన రాకేశ్ రెడ్డి, రోహిత్ అనే విద్యార్థులు

అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్న వేళ మరో విషాదకర ఘటన జరిగింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రమాదవశాత్తూ జలపాతంలో మునిగి మృత్యువాతపడ్డారు. ఆరిజోనా యూనివర్సిటీ నుంచి ఇటీవలే ఎంఎస్‌ పట్టా పొందిన లక్కిరెడ్డి రాకేశ్‌రెడ్డి (23), రోహిత్‌ మణికంఠ రేపాల (25) అనే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఎంఎస్ పట్టా అందుకున్న కొద్ది రోజులకే చోటుచేసుకున్న ఈ విషాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఉన్నత చదువు పూర్తయిన సందర్భంగా రాకేశ్ రెడ్డి, రోహిత్ సహా మొత్తం 16 మంది స్నేహితులు ఆరిజోనాలోని ప్రసిద్ధ ఫాజిల్‌ క్రీక్‌ జలపాతాన్ని వీక్షించడానికి వెళ్లారు. ప్రమాదవశాత్తూ రాకేశ్‌, రోహిత్‌లు జలపాతంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన చేరుకుని రాత్రి వరకు గాలించినా వారిద్దరి ఆచూకి దొరకలేదు. తర్వాతి రోజు సుమారు 25 అడుగుల లోతులో ఇద్దరి మృతదేహాలను గజ ఈతగాళ్లు గుర్తించారు.

ఖమ్మం నగరానికి చెందిన మాంటిస్సోరి, తెలంగాణ నారాయణ పాఠశాలల అధినేతల్లో ఒకరైన చంద్రశేఖర్‌రెడ్డి, పద్మ దంపతుల ఏకైక కుమారుడు రాకేశ్‌రెడ్డి అని తెలిసింది. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసి ఉన్నత చదువుల కోసం అతడు అమెరికా వెళ్లాడు. కుమారుడు పట్టా తీసుకుంటున్న సంతోషకర క్షణాలను పంచుకునేందుకు తల్లిదండ్రులు కూడా అమెరికా వెళ్లారు. కానీ దురదృష్టవశాత్తూ వారు అక్కడ ఉండగానే అతడు ప్రాణాలు కోల్పోయారు. ఒకటి రెండు రోజుల్లో మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురానున్నారు. కాగా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఎంఎస్‌ చేసిన రోహిత్‌ మణికంఠకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

USA
Students Died
America
Telugu Students
  • Loading...

More Telugu News