YS Vijayamma: కడప లోక్ సభ నియోజకవర్గ ప్రజలకు వైఎస్ విజయమ్మ ప్రత్యేక సందేశం... వీడియో షేర్ చేసిన షర్మిల

YS Vijayamma appeals Kadapa Lok Sabha constituency voters please vote for Sharmila

  • కడప ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల
  • ప్రస్తుతం అమెరికాలో ఉన్న విజయమ్మ
  • షర్మిల విజయం కోసం వీడియో ద్వారా సందేశం
  • వీడియోను పంచుకున్న షర్మిల

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లోక్ సభ ఎన్నికల్లో కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో, షర్మిల గెలుపు కోసం ఆమె తల్లి వైఎస్ విజయమ్మ కడప లోక్ సభ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రత్యేక సందేశం వెలువరించారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న విజయమ్మ ఈ మేరకు ఓ వీడియో వెలువరించారు. 

వైఎస్ ను అభిమానించేవారికి, ఆయనను ప్రేమించేవారికి, యావత్ కడప లోక్ సభ నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు. రాజశేఖర్ రెడ్డి  గారిని మీరు ఏ విధంగా అక్కునచేర్చుకున్నారో, ఏవిధంగా నిలబెట్టారో, ఆవిధంగానే ఆయన కూడా ఊపిరి ఉన్నంతవరకు మీ కోసం ప్రజాసేవలో అంకితమయ్యారు. ప్రజాసేవలోనే ఆయన చనిపోయారు. 

ఇవాళ ఆయన ముద్దుబిడ్డ షర్మిలమ్మ కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తోంది. ఇవాళ ఆ బిడ్డను గెలిపించి పార్లమెంటుకు పంపించాలని ప్రార్థిస్తున్నాను. నాడు రాజశేఖర్ రెడ్డి గారిని ఆదరించినట్టే నేడు కడప ప్రజలు షర్మిలను కూడా ఆదరించాలి. వైఎస్ లా కడప ప్రజలకు సేవ చేసే అవకాశం షర్మిలకు కూడా కల్పించాలి" అని విజయమ్మ విజ్ఞప్తి చేశారు.

కాగా, ఈ వీడియోను షర్మిల సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమ్మ ప్రార్థన, నాన్న ఆశీస్సులు, కడప ప్రజలు నన్ను గెలిపిస్తారనే ధృడమైన విశ్వాసంతో ఉన్నాను అంటూ షర్మిల పేర్కొన్నారు.

More Telugu News