Errabelli: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతానని ముందే తెలుసు... అందుకే సీటు మార్చాలని కేసీఆర్‌ను అడిగా: ఎర్రబెల్లి దయాకరరావు

Errabelli says he knows about his defeat from Palakurthi

  • 3 నెలల ముందు సీటు మార్చాలని అధినేతను కోరినట్లు చెప్పిన దయాకర రావు
  • అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 40 సీట్లు మాత్రమే గెలుస్తుందని తాను ముందే చెప్పానని వ్యాఖ్య
  • 20 స్థానాలను మార్చాలని కేసీఆర్‌ను కోరానని వెల్లడి
  • వరంగల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ 40వేల మెజార్టీతో గెలుస్తారని ధీమా

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతానని తనకు ముందే తెలుసునని... అందుకే తన సీటును మార్చాలని అంతకుముందే పార్టీ అధినేత కేసీఆర్‌ను కోరానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. ఎర్రబెల్లి దయాకరరావు 1994, 1999, 2004లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి వరుసగా విజయం సాధించారు. 2009, 2014, 2019లో పాలకుర్తి నుంచి విజయం సాధించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఓటమి ఎరుగని నేత 2023లో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని చేతిలో ఓటమి చెందారు.

శనివారం వరంగల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఓడిపోతానని తెలుసునని... అందుకే 3 నెలల ముందు సీటు మార్చాలని అధినేతను కోరినట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 40 సీట్లు మాత్రమే గెలుస్తుందని తాను ముందే చెప్పానన్నారు. తనతో సహా 20 స్థానాలను మార్చాలని కోరినట్లు చెప్పారు. ప్రజల ఆలోచనలు... అభిప్రాయాలు తనకు తెలుసునన్నారు. ఇప్పుడు వరంగల్ లోక్ సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ దాదాపు 40 వేల మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ రెండోస్థానం కోసం పోటీ పడుతున్నాయన్నారు.

More Telugu News