andhra pradesh: వాహనానికి ప్రమాదం.. బయటపడ్డ రూ. 7 కోట్ల ఎన్నికల డబ్బు!
- ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో ఘటన
- తౌడు బస్తాల మధ్య 7 బాక్సుల్లో డబ్బు దాచిన వైనం
- గాయపడ్డ డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. డబ్బు స్వాధీనం
ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో రాజకీయ పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తరలుతున్న ఎన్నికల డబ్బు పోలీసుల తనిఖీల్లో భారీగా పట్టుబడుతోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఈ తరహా ఘటన చోటుచేసుకుంది.
జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలువ దగ్గర ఓ లారీ వెళ్లి టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ వాహనం బోల్తాపడింది. విశాఖ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద వార్త తెలియగానే ఘటనా స్థలానికి కానిస్టేబుల్ ఎస్. రవికుమార్ చేరుకున్నాడు. వాహనంలో తౌడు బస్తాల మధ్య మొత్తం 7 బాక్సుల్లో నగదును దాచి తరలిస్తున్నట్లు గుర్తించాడు. వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాడు.
హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చిన అధికారులు నగదును వీరవల్లి టోల్ ప్లాజాకు తరలించి లెక్కించగా దాదాపు రూ. 7 కోట్లుగా తేలింది. వాహన డ్రైవర్ కు గాయాలు కావడంతో అతన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.