Shubman Gill: గుజరాత్ టైటాన్స్ సారధికి భారీ జరిమానా!
- శుభమన్ గిల్‌కు రూ. 24 లక్షల జరిమానా
- 'స్లో ఓవర్ రేట్' కారణంగానే భారీ ఫైన్
- నిన్న అహ్మదాబాద్ వేదికగా సీఎస్‌కే, జీటీ మధ్య మ్యాచ్
- 35 పరుగుల తేడాతో చెన్నైను చిత్తు చేసిన గుజరాత్
గుజరాత్ టైటాన్స్ (జీటీ) సారధి శుభమన్ గిల్‌కు రూ. 24 లక్షల భారీ జరిమానా పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ భారీ ఫైన్ వేశారు. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేసింది. కాగా, ఈ సీజన్‌లో ఇలా స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేయడం ఆ జట్టుకు ఇది రెండోసారి. దీంతో కెప్టెన్‌తో సహా 11 మంది ఆటగాళ్లకు కూడా జరిమానా వేయడం జరిగింది. వీరితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ఉన్నాడు.
11 మంది ప్లేయర్లకు రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్ వేస్తారు. ఈ రెండింటీలో ఏది తక్కువగా ఉంటే దాన్ని వసూలు చేయడం జరుగుతుంది. ఇక శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్‌కేను 35 పరుగుల తేడాతో గుజరాత్ చిత్తు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ .. ఇద్దరూ శతకాలతో చెలరేగారు.
గిల్ 55 బంతుల్లో 104 పరుగులు చేయగా.. సుదర్శన్ 51 బంతుల్లో 103 రన్స్ చేశాడు. ఈ ద్వయం ఏకంగా రికార్డుస్థాయిలో 210 పరుగుల భాగస్వామ్యం అందించింది. ఇక ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన జీటీ 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంటే.. చెన్నై 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.