PM Modi: అజిత్ పవార్ తో కలవాలంటూ మోదీ సూచన.. శరద్ పవార్ ఏమన్నారంటే..!

Sharad Pawar Reaction On PM Modi Advise

  • మహారాష్ట్రలోని నందర్బార్ ఎన్నికల ప్రచారంలో మోదీ పరోక్ష వ్యాఖ్యలు 
  • లోక్ సభ ఫలితాల తర్వాత చిన్న పార్టీలన్నీ కాంగ్రెస్ లో విలీనం కావాలన్న శరద్ పవార్ 
  • పూర్తిగా కనుమరుగవడం కన్నా చీలిన పార్టీని ఒక్కటి చేసుకోవాలన్న మోదీ

పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్సీపీ, శివసేన పార్టీలు మళ్లీ ఒక్కటవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా సూచించారు. ఈమేరకు మహారాష్ట్రలోని నందర్బార్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. శరద్ పవార్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయనను ఉద్దేశిస్తూ.. ‘ఇక్కడ ఓ పెద్ద లీడర్ ఉన్నారు. నలభై యాభై ఏళ్లుగా రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికలు పూర్తయి, ఫలితాలు వచ్చాక చిన్నాచితకా పార్టీలు ఉనికి కాపాడుకోవాలంటే కాంగ్రెస్ లో విలీనం కావాల్సిందేనని చెబుతున్నారు. అంటే.. నకిలీ ఎన్సీపీ, నకిలీ శివసేన పార్టీల అధినేతలు కాంగ్రెస్ లో విలీనం కావాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారని అర్థమవుతోంది. కానీ కాంగ్రెస్ లో విలీనం అయి ఉనికి లేకుండా పోవడం కన్నా వారు అజిత్ పవార్, ఏక్ నాథ్ షిండేలతో కలవడం మంచిది’ అని అన్నారు.

మోదీ సూచనపై ఎన్సీపీ శరద్ పవార్ స్పందిస్తూ.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై నమ్మకంలేని వ్యక్తులతో కానీ, పార్టీలతో కానీ తాను ఎన్నటికీ కలవబోనని తేల్చిచెప్పారు. దేశంలో అన్ని మతాలను కలుపుకుంటూ పోవడం, ప్రజల్లో ఐకమత్యం పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పారు. ప్రధాని మోదీ ఇటీవలి వ్యాఖ్యలు వివిధ మతాలు, వర్గాల మధ్య చీలిక తెచ్చేలా ఉన్నాయని శరద్ పవార్ ఆరోపించారు. ఈ ధోరణి దేశానికి చాలా ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా నడుచుకునే వారితో తాను కానీ, తన సహచరులు కానీ ఎన్నటికీ చేతులు కలపబోరని శరద్ పవార్ తేల్చిచెప్పారు.

More Telugu News