friendship marriage: అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ తెలుసు.. ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ గురించి విన్నారా!
- జపాన్ లో ట్రెండింగ్ అవుతున్న కొత్త తరహా పెళ్లి
- సరికొత్త బంధం వైపు ఆకర్షితులవుతున్న జపాన్ యువత
- 2015 నుంచి 500 మందికి ఈ పెళ్లిళ్లు చేశామన్న ఓ సంస్థ
మనసులు కలిసిన జంటలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యేందుకు ఉన్న మార్గాలు అరేంజ్డ్ మ్యారేజ్ లేదా లవ్ మ్యారేజ్ అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ జపాన్ లో ఓ నయా మ్యారేజ్ ట్రెండింగ్ అవుతోంది! ఈ సరికొత్త బంధం యువతను తెగ ఆకర్షిస్తోంది! దాని పేరే ఫ్రెండ్ షిప్ మ్యారేజ్!!
ఇదొక హైబ్రీడ్ పెళ్లి బంధం అన్నమాట. జీవితాంతం తోడుంటానంటూ నాతిచరామి అంటూ ఒట్టు వేయాల్సిన పనేమీ లేదట! జస్ట్ నచ్చినన్ని రోజులు, వారాలు, నెలలు, మహా అయితే కొన్నేళ్లు కలిసి ఉంటామని అగ్రిమెంట్ పై సంతకాలు చేస్తే సరిపోతుందట!
దీంతో జపనీయులు ఈ బంధంలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఈ తరహా పెళ్లిళ్లు చేసి పెడుతున్న కొలొరస్ అనే సంస్థ వెల్లడించింది. 2015 నుంచి 500 మందికి తమ సంస్థ ఇలా ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ లు చేసినట్లు చెప్పింది. ఈ జాబితాలో అలైంగికులు, స్వలింగ సంపర్కులు, బహులింగ సంపర్కులు కూడా ఉన్నారండోయ్!
ఇదేదో భలే ఉందిగా అనుకుంటున్నారా? అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ లో జస్ట్ స్నేహం మాత్రమే ఉంటుందట. అంటే ఇంకా అర్థం కాలేదా? ఈ పెళ్లి తర్వాత దంపతుల మధ్య రొమాన్స్, సెక్స్, పిల్లల్ని కనడం లాంటి వాటికి మాత్రం చోటులేదు! కేవలం కొంతకాలంపాటు స్నేహితులుగానే ఉండి ఆ తర్వాత విడిపోవాలి. అందుకు అంగీకరించే జంటలు మాత్రమే చట్టబద్ధంగా కాగితపు పెళ్లి చేసుకుంటాయన్నమాట. పిల్లలను కనాలనుకుంటే కృత్రిమ గర్భధా రణ పద్ధతులను ఫాలో అవుతాయి. అలాగే ఈ రిలేషన్ షిప్ లో ఉంటూనే ఒకరికన్నా ఎక్కువ మంది పార్ట్ నర్లను కొనసాగించొచ్చట. కానీ ఈ విషయాన్ని ముందుగానే అగ్రిమెంట్ లో రాసుకోవాలట. ఎంత కాలం కలిసి జీవించాలి.. అందుకు విధించాలనుకొనే షరతులు ఏమిటి అనే వివరాలను కూడా అగ్రిమెంట్ లో క్లియర్ గా మెన్షన్ చేయాలట.
మరి దీనివల్ల కలిగే లాభం ఏమిటి అని అనుకుంటున్నారా? 'ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ అనేది ఒకే రకమైన అభిరుచులు ఉన్న రూంమేట్ ను ఎంపిక చేసుకోవడం లాంటిదని ఈ పద్ధతిలో ఒక్కటైన జంటలు చెబుతున్నాయి. సంప్రదాయ పెళ్లి బంధాన్ని ఇష్టపడని ఓ యువతి ఈ రిలేషన్ లోకి వెళ్లడానికి గల కారణాన్ని చెప్పింది. 'వేరొకరి గర్ల్ ఫ్రెండ్ గా ఉండేందుకు నేను తగను. కానీ నేను ఒక మంచి స్నేహితురాలిగా ఉండగలను. నాకున్న ఇష్టాయిష్టాల్లాంటివే ఉన్న వ్యక్తితో సరదాగా మాట్లాడటం, కలిసి ఉండటాన్ని ఆస్వాదించగలను' అని చెప్పింది.