Dharmapuri Arvind: ఉత్తమ్, కోమటిరెడ్డి అనుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుంది: ధర్మపురి అర్వింద్
- ప్రజలు గట్టిగా కోరుకుంటే ఈ ప్రభుత్వం పడిపోవడం ఖాయమన్న అర్వింద్
- లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు మోదీకి ఓటు వేస్తారన్న అర్వింద్
- తనపై ఒక్క అవినీతి ఆరోపణ లేదని, అవినీతి చేసే పరిస్థితి వస్తే రాజకీయాలు వదిలేస్తానన్న ఎంపీ
- తనకంటే ముందు ఎంపీగా ఉన్న కవిత జైల్లో ఉన్నారని వ్యాఖ్య
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని నిజామాబాద్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు గట్టిగా కోరుకుంటే ఈ ప్రభుత్వం పడిపోవడం ఖాయమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని వేల్పూరులో నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడుతూ... లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు మోదీకి ఓటు వేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరుకుందన్నారు.
దేశంలో ఉన్న రెండు రాష్ట్రాల్లోనూ ఆ ప్రభుత్వం పడిపోతుందన్నారు. కాంగ్రెస్ తప్పుడు హామీలతో ఆయా రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజలను మోసగించినందుకు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. అయిదేళ్లలో ఎంపీగా తనపై ఒక్క అవినీతి ఆరోపణ లేదన్నారు. కానీ తనకంటే ముందు ఎంపీగా ఉన్న కవిత మాత్రం మద్యం పాలసీ కేసులో జైలుకు వెళ్లారని పేర్కొన్నారు. అవినీతి చేసే రోజు వస్తే తాను రాజకీయాలను వదిలేస్తానని ప్రతిజ్ఞ చేశారు. తప్పు మాత్రం చేసే ప్రసక్తి లేదన్నారు.
తాను ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డును తీసుకు వచ్చానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే జక్రాన్‌పల్లి ఎయిర్ పోర్టును ఏడాదిలోపు తెరుచుకోవచ్చునన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. అందుకే పనులు కావడం లేదన్నారు.