Nara Lokesh: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో మీ భూమి, మీ ఇల్లు మీది కాదు :నారా లోకేశ్
- ల్యాండ్ టైటిలింగ్ చట్టం రాకతో భూ సంబంధిత ఫిర్యాదులు పెరిగాయన్న లోకేశ్
- అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ
- కూటమిని అధికారంలోకి తీసుకురావాలని లోకేశ్ పిలుపు
ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో మీ ఇల్లు మీది కాదని, మీ భూములు మీవి కావని ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని తెలుగుదేశం నేత నారా లోకేశ్ రాష్ట్ర ప్రజలకు ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో 2020 ఏప్రిల్ నుంచి 2023 మే వరకు రెవెన్యూ శాఖకు 1.34 లక్షల భూ సంబంధిత ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. అందులో భూ ఆక్రమణలపై ఫిర్యాదులు 31 వేలు కాగా, రికార్డుల్లో తప్పులు దొర్లిన అంశంపై 39 వేల ఫిర్యాదులు ఉన్నాయన్నారు. ఇక వైఎస్సార్ కడప జిల్లాలో 1,892 భూ ఆక్రమణల ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఫిర్యాదు చేయనివ్వకుండా బెదిరించిన, ఫిర్యాదులు అధికారులు తీసుకోని ఘటనలు అనేకం ఉన్నాయని నారా లోకేశ్ చెప్పారు.
ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా మీ భూములకు సంబంధించిన దస్తావేజులు చేతికివ్వరని, అధికారం, డబ్బు,కండబలం ఉంటే ఎటువంటి భూమినైనా రాజకీయనేతలు కొట్టేసే అవకాశముందని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. సరైన కాగితాల్లేవని యజమానులనే జైల్లో పెట్టే అవకాశముందని తెలిపారు. భూ హక్కులపై వారసత్వాన్ని అధికారులు మాత్రమే నిర్ణయించగలుగుతారని లోకేశ్ వెల్లడించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా జగన్ మోహన్ రెడ్డి మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టే అవకాశముందని, మీకు అన్యాయం జరిగిందని కోర్టులకూ కూడా వెళ్లలేని పరిస్థితులు ఏర్పడతాయని వివరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.
మరోవైపు కూటమి అధికారంలోకి రాగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా హామీ నిచ్చారు. స్థిరాస్తితో మనిషికి ఉండే అనుబంధం భూమికి చెట్టుకు ఉన్నంతగా ఉంటుందని తెలిపారు. వందల తరాలకు సరిపడా ఆస్తులను దోచుకుని దాచుకోవడమే కానీ, ఆ తరాల మధ్య ప్రేమలను సీఎం జగన్ పట్టించుకోడని అందుకే ఆయన చెల్లెలు షర్మిలను కూడా దూరం పెట్టాడని చంద్రబాబు తూర్పారబెట్టారు.