KTR: సునీతా మహేందర్ రెడ్డి చేవెళ్ల సీటు అడిగితే రేవంత్ రెడ్డి బలవంతంగా మల్కాజ్‌గిరి ఇచ్చారు: కేటీఆర్
- ఈటల రాజేందర్ ఓడిపోతే హుజూరాబాద్ వెళ్లిపోవాల్సిందేనని వ్యాఖ్య
- సునీతా మహేందర్ రెడ్డి తాండూరు వెళ్లిపోతారన్న కేటీఆర్
- వారిద్దరూ పొలిటికల్ టూరిస్టులని వ్యాఖ్య
- తెలంగాణలో పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందన్న బీఆర్ఎస్ నేత
ఈటల రాజేందర్, సునీతా మహేందర్ రెడ్డి ఇద్దరూ మల్కాజ్‌గిరికి పొలిటికల్ టూరిస్టులేనని... మే 13 తర్వాత వాళ్లు కనిపించరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజ్‌గిరి లోక్ సభ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన యూత్ మీటింగ్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ... రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిది తాండూరు అని, ఆమె వాస్తవానికి చేవెళ్ల సీటు అడిగితే రేవంత్ రెడ్డి బలవంతంగా మల్కాజ్‌గిరిని కట్టబెట్టారని విమర్శించారు. ఆమె కూడా బలవంతంగానే ప్రచారం చేస్తోందని... ఓడిపోతే సునీతా తిరిగి తాండూరు వెళ్లాల్సిందే అన్నారు.
బీజేపీ అభ్యర్థి ఈటలది కూడా మల్కాజ్‌గిరి కాదని... ఆయన హుజూరాబాద్ వెళ్ళవలసిందే అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాత్రం లోకల్ అన్నారు. ఆయన ఉప్పల్‌లోనే ఉంటారని... మీ మధ్యలోనే ఉండే వ్యక్తి అన్నారు. ఐదు నెలల క్రితం రేవంత్ రెడ్డి ఎన్నో మాటలు చెప్పారని... కానీ ఒక్క హామీనీ నెరవేర్చలేదన్నారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలవుతున్నా చిల్లర మాటలు... ఉద్దెర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణ పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందన్నారు. సినిమాలో విలన్ డైలాగులు తప్ప ఒక్క పని చేసింది లేదన్నారు. కొత్త పరిశ్రమలు వచ్చుడు తర్వాత... ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయన్నారు. ఫార్మా సిటీని రద్దు చేశారని... ఇలా తెలివి తక్కువ వారికి అవకాశమిస్తే కరెంట్, ఉద్యోగాలు కూడా రావని హెచ్చరించారు. రియల్ ఎస్టేట్ పడిపోయిందని, ఇచ్చిన గ్యారెంటీ నిలుపుకోలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది అన్నారు.