G Jagadish Reddy: కోమటిరెడ్డి సోదరులను నేను ఓడించానని చెప్పానా? అలాంటి పోజులు కొట్టే అలవాటు లేదు: జగదీశ్ రెడ్డి

Jagadeesh Reddy challenges Komatireddy brothers about assets

  • తన ఆస్తులు, కోమటిరెడ్డి ఆస్తులు లెక్కలు తీయాలన్న జగదీశ్ రెడ్డి
  • సీఎం రేవంత్ రెడ్డి అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నారని విమర్శ
  • ఆర్థిక పరిస్థితి తెలియకుండా హామీలు ఇవ్వడమే మోసమని ఆగ్రహం

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డిలను ఓడించానని ఎప్పుడైనా చెప్పానా? అలాంటి పోజులు కొట్టే అలవాటు తనకు లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కోమటిరెడ్డి ఓ పరాన్నజీవి అని విమర్శించారు. తన గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదన్నారు. తన ఆస్తులు, కోమటిరెడ్డి ఆస్తుల లెక్కలు తీయాలని... అప్పుడు ఎవరి ఆస్తులు పెరిగాయో తెలుస్తుందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆర్థిక పరిస్థితి తెలియకుండా హామీలు ఇవ్వడం మోసమే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి తమకు ఓట్లు పెరుగుతాయన్నారు. జానారెడ్డి బీఆర్ఎస్ నేతల ఇళ్లకు వెళ్లి కండువా కప్పుతున్నారని విమర్శించారు. బిల్లులు ఇవ్వమని బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో సగం మంది అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి వెళ్లినవారే అన్నారు.

ఎంత పెద్ద వర్షం వచ్చినా తాము రెండు గంటల్లో విద్యుత్‌ను పునరుద్ధరించామన్నారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పడం ఓ వర్గం మనోభావాలు దెబ్బతీయడమే అన్నారు. అలా మాట్లాడే వారిపై ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు. ఉన్న రిజర్వేషన్లు తొలగించడానికి తాము వ్యతిరేకమన్నారు. వేలకోట్లు ఢిల్లీకి వెళుతున్నాయని మోదీ అంటున్నారని... తెలిసి కూడా ఎందుకు పట్టుకోవడం లేదో చెప్పాలన్నారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొత్తది కాదని... ఉద్యమ కాలంలోనూ తమ ఫోన్లను ట్యాప్ చేశారని పేర్కొన్నారు. ఏ భార్యాభర్తల ఫోన్ విన్నారో చెప్పాలని... ఎవరైనా ఫిర్యాదు చేశారా అన్నది చెప్పాలన్నారు. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై కూడా జగదీశ్ రెడ్డి స్పందించారు. పిట్రోడావి పిచ్చి మాటలని కొట్టి పారేశారు. రాజకీయం కోసమే మోదీ ఆయన మాటలను పట్టించుకుంటున్నారని విమర్శించారు.

More Telugu News