bank officers: బ్యాంకు సిబ్బందిపై ఉన్నతాధికారుల దూషణలపర్వం.. వీడియోలు వైరల్

Video Canara Bandhan Bank Officers Abuse Staff Over Targets Banks React

  • సెలవు రోజైనా టార్గెట్లు రీచ్ కావాల్సిందేనని ఆదేశం
  • కుటుంబ, వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి పనిచేయాలని హుకుం
  • నెట్టింట వైరల్ కావడంతో స్పందించిన రెండు బ్యాంకులు
  • తగిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడి.. విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రకటన

వార్షిక టార్గెట్లు చేరుకోలేదంటూ బంధన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ కు చెందిన ఉన్నతాధికారులు తమ జూనియర్ ఉద్యోగులపై అసభ్య పదజాలంతో దూషించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. సెలవు రోజుల్లోనైనా పనిచేయాల్సిందేనని ఆదేశించడం, బెదిరింపు ధోరణిలో వారు మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. 

ఒక వీడియోలో కెనరా బ్యాంక్ ఉన్నతాధికారి లోకపతి స్వెయిన్ తన కింద పనిచేసే ఉద్యోగులను స్కైప్ కాల్ లో మందలిస్తున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో చక్కర్లు కొడుతోంది. ‘సెలవు రోజుల్లో కూడా డబ్బు రికవరీ చేయాల్సిందే. ఆఫీసు వేళలు అయిపోయాక మీకు ఫ్యామిలీ టైం కావాలా? కుటుంబంతో కలసి బయట తిరుగుతామంటారా? నేను అస్సలు ఊరుకోను. నేను నా ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు. కేవలం కెనరా బ్యాంక్ గురించే ఆలోచిస్తుంటా. ఇకపై ప్రతివారం.. సోమవారం నుంచి శనివారం దాకా పనిచేయాల్సిందే. ఆదివారమైనా లేదా సెలవు రోజైనా పని ఆపడానికి వీల్లేదు. నా మాట వినని వారు అధికారి అయినా, చీఫ్ మేనజర్ అయినా, ఏజీఎం అయినా ఉపేక్షించను జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు.

మరో వీడియోలో కునాల్ భరద్వాజ్ అనే అధికారి తన జూనియర్ పై విరుచుకుపడ్డారు. నెలవారీ టార్గెట్లు రీచ్ కానందుకు అసభ్య పదజాలంతో దూషించారు. ఇప్పుడు సాధించిన పనితీరుకు సిగ్గుపడాలని మండిపడ్డారు. ఆ ఉద్యోగి పొరపాటును క్షమించాలని కోరినా పట్టించుకోలేదు. 

మరోవైపు తమ ఉన్నతాధికారి జూనియర్లను తిట్టిపోసిన వీడియోపై కెనరా బ్యాంక్ స్పందించింది. సంస్థ ఎదుగుదలలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల భాగస్వామ్యానికి ఎల్లప్పుడూ విలువ ఇస్తామని ‘ఎక్స్’లో పేర్కొంది. తమ ఉన్నతాధికారి ప్రవర్తనను అంగీకరించట్లేదని.. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. బంధన్ బ్యాంక్ సైతం ఇదే రీతిలో స్పందించింది. విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని.. ఉన్నతాధికారుల ప్రవర్తను ఖండిస్తున్నామని వివరణ ఇచ్చింది. ఇప్పటికే ఆ అధికారిపై చర్యలు తీసుకున్నట్లు చెప్పింది.

అయితే బ్యాంకులు వివరణ ఇచ్చినప్పటికీ ఆ వీడియోలు చూసిన నెటిజన్లు మాత్రం దుమ్మెత్తిపోస్తున్నారు. సంస్థ దృష్టికి రాని వేలాది కేసుల పరిస్థితి ఏమిటని ఓ యూజర్ కెనరా బ్యాంక్ ను ప్రశ్నించాడు. కెనరా బ్యాంక్ లో పని వాతావరణం గురించి అందరికీ తెలిసిందేనని ఓ నెటిజన్ ఎద్దేవా చేశాడు. ఫిర్యాదులపై కస్టమర్లు పంపే ఈమెయిల్స్ కు లేదా ఫోన్ కాల్స్ కు బ్యాంకు ఎప్పుడూ స్పందించదని మరొకరు విమర్శించారు. కెనరా బ్యాంక్ చెప్పే విలువలన్నీ కాగితంపైనే ఉంటాయని.. ఆ సంస్థ విష సంస్కృతిని తట్టుకోలేక అందులో ఉద్యోగం మానేశానని మరొకరు కామెంట్ పోస్ట్ చేశారు.

More Telugu News