chicago: అమెరికాలో అదృశ్యమైన తెలంగాణ విద్యార్థి

indian student in chicago missing from May 2nd family concerned

  • మే 2వ తేదీ నుంచి తెలియని రూపేశ్ చంద్ర చింతకింది ఆచూకీ
  • షికాగోలోని భారత రాయబార కార్యాలయం వెల్లడి
  • విస్కాన్సిన్‌లోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్‌ చేస్తున్న రూపేశ్

అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఓ తెలంగాణ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ నెల 2వ తేదీ నుంచి 25 ఏళ్ల రూపేశ్ చంద్ర చింతకింది ఆచూకీ తెలియడం లేదని షికాగోలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. రూపేశ్ జాడ కనిపెట్టేందుకు స్థానిక పోలీసులతోపాటు ప్రవాస భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఈ విషయంలో తమకు సహకరించాలని పోలీసులు సైతం స్థానికులను కోరారు. అతను షికాగోలోని ఎన్ షెరిడియన్ రోడ్డులో ఉన్న 4300 బ్లాక్ లో నివసించే వాడని.. అక్కడి నుంచే అతను కనిపించకుండా పోయినట్లు పేర్కొన్నారు.

తెలంగాణలోని హనుమకొండ జిల్లాకు చెందిన రూపేశ్.. విస్కాన్సిన్ రాష్ట్రంలోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. ఈ నెల 2న తన కుమారుడితో వాట్సాప్ కాల్ లో మాట్లాడానని.. అప్పుడు పనిలో ఉన్నానని చెప్పాడని రూపేశ్ తండ్రి సీహెచ్ సదానందం మీడియాకు తెలిపారు. ఆ తర్వాత నుంచి ఫోన్లో అందుబాటులోకి రాలేదని చెప్పారు. అతని స్నేహితులను సంప్రదించగా టెక్సాస్ నుంచి రానున్న కొందరిని కలిసేందుకు వెళ్తున్నట్లు చెప్పారన్నారు. కానీ రూపేశ్ ను కలవడానికి వచ్చేది ఎవరో తెలియదని స్నేహితులు చెప్పినట్లు సదానందం వివరించారు. దీంతో తాము ఆందోళనకు గురై విదేశాంగ శాఖతోపాటు అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించినట్లు తెలిపారు.

అమెరికాలో ఇటీవలి కాలంలో వరుసగా దాడులు, కిడ్నాప్‌ లు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ దాడుల్లో పలువురు భారతీయ, భారత సంతతి విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తమ దేశంలో చదువుతున్న విదేశీ విద్యార్థుల భద్రతకు కట్టుబడి ఉన్నట్లు అమెరికా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

More Telugu News