SRH: హైదరాబాదులో నిన్న వర్షం... ఇవాళ సిక్సర్ల వర్షం... సన్ రైజర్స్ రికార్డ్ ఛేజింగ్

SRH sensational batting against LSG in home ground

  • ఉప్పల్ స్టేడియంలో పరుగుల సునామీ
  • లక్నో సూపర్ జెయింట్స్ ను 10 వికెట్ల తేడాతో కొట్టిన సన్ రైజర్స్
  • మొదటి 4 వికెట్లకు 165 పరుగులు చేసిన లక్నో సూపర్ జెయింట్స్
  • 9.4 ఓవర్లలోనే కొట్టేసిన సన్ రైజర్స్
  • ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ సుడిగాలి బ్యాటింగ్

హైదరాబాదు నగరం నిన్న భారీ వర్షం, ఈదురుగాలులతో అతలాకుతలం కాగా, ఇవాళ ఉప్పల్ స్టేడియంలో సిక్సర్ల వర్షంతో ప్రేక్షకులు తడిసి ముద్దయ్యారు. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో నమ్మశక్యం కాని రీతిలో సన్ రైజర్స్ సంచలన బ్యాటింగ్ ప్రదర్శన నమోదు చేసింది. 

166 పరుగుల విజయలక్ష్యాన్ని సన్ రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ప్రచండ వేగంతో ఛేదించారు. ఈ లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించి ఔరా అనిపించారు. 

ఈ క్రమంలో హెడ్ 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 89 పరుగులు చేయగా.... అభిషేక్ శర్మ 28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 75 పరుగులు. వీళ్లిద్దరిని అవుట్ చేయడం అటుంచితే, పరుగులు రాకుండా చూసుకోవడం లక్నోకు శక్తికి మించిన పనైంది. ఊచకోత అంటే ఎలా ఉంటుందో హెడ్, అభిషేక్ శర్మ తమ బ్యాటింగ్ ప్రదర్శనతో చాటి చెప్పారు. 

ఈ జోడీ సిక్సర్లు, ఫోర్లు పోటీలు పడి బాదుతుంటే లక్నో ఆటగాళ్లు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. ఇది హిట్టింగ్ లో నెక్ట్స్ లెవల్ అనే రీతిలో సన్ రైజర్స్ ఓపెనర్ల విధ్వంసం కొనసాగింది. టీ20 ఫార్మాట్ లోనే ఇలాంటి సామర్థ్యం ఉన్న ఓపెనింగ్ జోడీ మరొకటి లేదని క్రికెట్ పండితులు పేర్కొన్నారు. ఎందుకంటే, ఐపీఎల్ చరిత్రలోనే 160 ప్లస్ స్కోరు ఛేదించడంలో ఇది ఫాస్టెస్ట్ బ్యాటింగ్ ప్రదర్శనగా రికార్డు పుటల్లోకెక్కింది. 

లక్నోపై గ్రాండ్ విక్టరీతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. హైదరాబాద్ జట్టు ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా, మరొక్క విజయం సాధిస్తే ప్లే ఆఫ్ బెర్తు ఖరారవుతుంది.

SRH
Travis Head
Abhishek Sharma
LSH
Hyderabad
IPL 2024
  • Loading...

More Telugu News