Sam Pitroda: వరుసగా వివాదమవుతున్న వ్యాఖ్యలు... కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా

Sam Pitroda steps down as Indian Overseas Congress chief
  • స్వయంగా ఆయనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
  • రాజీనామా లేఖను మల్లికార్జున ఖర్గేకు పంపించిన శామ్ పిట్రోడా
  • పిట్రోడా రాజీనామాను ఆమోదించిన ఖర్గే
కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చైర్మన్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా చేశారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. గత ఏడాది అయోధ్య రామమందిరంపై, కొన్నిరోజుల క్రితం వారసత్వపు పన్నుపై, తాజాగా భారతీయులపై ఆయన చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో మంగళవారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదించారు. తన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతుండటంతో ఆయనే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

భారత్‌లోని భిన్నత్వం గురించి శామ్ పిట్రోడా మాట్లాడుతూ భారతీయులను అవమానించేలా మాట్లాడారని విమర్శలు వచ్చాయి. ఈశాన్య ప్రజలు చైనీయల్లా, పశ్చిమవాసులు అరబ్బులుగా, ఉత్తరాదివాళ్లు శ్వేతజాతీయులుగా, దక్షిణాదివారు ఆఫ్రికన్లుగా కనిపిస్తారని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లోని భారతీయులను అవమానించేలా ఆయన మాట్లాడారని బీజేపీ నేతలు భగ్గుమన్నారు.

అంతకుముందు, అమెరికాలో వారసత్వ పన్ను ఉందని, ఒక వ్యక్తి 100 మిలియన్ డాలర్లు సంపాదిస్తే ఆ వ్యక్తి మరణం తర్వాత అందులో 55 శాతం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, ఇది తనకు న్యాయంగా కనిపిస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ అప్పుడే తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి వ్యక్తి సంపాదనలో 55 శాతం ప్రభుత్వపరం చేస్తుందని మండిపడింది. 2023లో రామమందిరంపై, 2019లో సిక్కు వ్యతిరేక అల్లర్లకు అనుకూలంగా వ్యాఖ్యలు, పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో సైనికులపై అనుమానం వ్యక్తం చేశారు.
Sam Pitroda
Congress
BJP
Lok Sabha Polls

More Telugu News