Tamilisai Soundararajan: హైదరాబాద్‌ను కేంద్రపాలితంగా చేయవచ్చుననే ప్రచారంపై స్పందించిన తమిళిసై

Tamilisai responds on Hyderabad UT issue

  • హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే ఆలోచన లేదని స్పష్టీకరణ
  • తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుస్తామని ధీమా
  • బీఆర్ఎస్ బలహీనపడిందన్న తమిళిసై
  • తెలంగాణ ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా కాంగ్రెస్ అబద్ధపు హామీలు ఇచ్చిందని విమర్శ
  • కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరాలంటే ఐదు రాష్ట్రాల బడ్జెట్ అవసరమని వ్యాఖ్య

హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయవచ్చుననే ప్రచారంపై తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. మంగళవారం ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. బీజేపీపై కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను చెన్నై సౌత్ నుంచి తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేశామన్నారు.

తెలంగాణలో తాము అత్యధిక లోక్ సభ స్థానాలు గెలుస్తామన్నారు. తెలంగాణ ప్రజలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ప్రధాని మోదీ తెలంగాణలో 22 సార్లు పర్యటించారని, ఎక్కువగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకే హాజరైనట్లు చెప్పారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ నెలకొందన్నారు. కొన్నిచోట్ల మాత్రమే బీఆర్ఎస్‌తో పోటీ ఉందన్నారు. బీఆర్ఎస్ చాలా బలహీనపడిందన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని మోదీ పర్యటనకు కూడా డుమ్మా కొట్టారని గుర్తు చేశారు. గవర్నర్ కార్యాలయానికి మర్యాద ఇవ్వలేదన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఐదు రాష్ట్రాల బడ్జెట్ అవసరమని విమర్శించారు. ముఖ్యంగా ప్రతి మహిళకు రూ.2500 హామీ అమలు చేయడం కష్టమన్నారు. వృద్ధులకు రూ.4వేల పెన్షన్, విద్యార్థినులకు స్కూటీ వంటి హామీలు అమలు చేయాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రాకముందే తెలంగాణ ఆర్థిక పరిస్థితి తెలుసునని, అయినప్పటికీ హామీలు ఇచ్చారన్నారు. ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఎకరాకు రూ.15 వేల రైతు భరోసా అమలు కావాల్సి ఉందన్నారు. రిజర్వేషన్లు ఎత్తేస్తారని రాహుల్ గాంధీ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా కాంగ్రెస్ హామీలు ఇచ్చిందన్నారు.

Tamilisai Soundararajan
BJP
Congress
Telangana
Lok Sabha Polls
  • Loading...

More Telugu News