AP High Court: ఇన్ పుట్ సబ్సిడీ నిధుల నిలిపివేతపై ఏపీ హైకోర్టులో అత్యవసర పిటిషన్
- ఏపీలో మే 13న ఎన్నికలు
- కొనసాగుతున్న ఎన్నికల కోడ్
- సంక్షేమ కార్యక్రమాలకు నిధుల విడుదల ఎన్నికల తర్వాతేనన్న ఈసీ
- పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు
- ప్రభుత్వం వినతి ఇస్తే పునఃపరిశీలిస్తామన్న ఈసీ... ఇవాళే వినతి ఇస్తామన్న ఏజీ
ఎన్నికల కోడ్ నేపథ్యంలో, ఏపీలో సంక్షేమ పథకాలకు నిధుల విడుదల కుదరదంటూ ఈసీ నిన్న స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తుపాను, కరవు వంటి విపత్తుల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, విద్యా దీవెన పథకం నిధుల విడుదలకు అనుమతించాలని ఏపీ సీఎస్ చేసిన విజ్ఞాపనలను ఈసీ తోసిపుచ్చింది.
ఇవి కొత్త పథకాలు కావని, ఇప్పటికే అమల్లో ఉన్నాయని ఏపీ ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ, ఎన్నికల ప్రక్రియ ముగిశాకే నిధులు విడుదల చేసుకోవాలని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది.
ఈ నేపథ్యంలో, ఇన్ పుట్ సబ్సిడీ నిధుల పంపిణీ నిలిపివేతపై ఏపీ హైకోర్టులో నేడు అత్యవసర పిటిషన్ దాఖలైంది. దీనిపై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది.
నిధుల విడుదల నిలిపివేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించాలంటూ పిటిషనర్ కోరారు. ప్రభుత్వం వినతి ఇస్తే పునఃపరిశీలన చేస్తామని ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. అందుకు ఏజీ స్పందిస్తూ... ప్రభుత్వం తరఫున వినతి ఇవాళే ఇస్తామని స్పష్టం చేశారు. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం మే 9కి వాయిదా వేసింది.