Telangana: ఎన్నికల వేళ రేవంత్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
- రైతు భరోసా డబ్బుల చెల్లింపులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు
- మే 13న పోలింగ్ ముగిసిన తర్వాతే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని సీఈసీ ఆదేశం
- సీఎం రేవంత్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణంతో ఎన్నికల సంఘం తాజా నిర్ణయం
లోక్‌సభ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రైతు భరోసా (రైతు బంధు) డబ్బుల చెల్లింపులపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆంక్షలు విధించింది. మే 13వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాతే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని సీఈసీ ఆదేశించింది. ఈ నెల 9వ తేదీలోగా రైతుభరోసా నిధులు జమ చేస్తామని పలు సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించడాన్ని కోడ్ ఉల్లంఘన కింద భావించిన ఎన్నికల సంఘం ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలాఉంటే.. పంట పెట్టుబడి కింద అన్నదాతలకు అందించే రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమైంది. ఇప్పటివరకు ఐదు ఎకరాలలోపు ఉన్న వారికి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. ఐదు ఎకరాలకు పైబడిన రైతులకు నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా సుమారు రూ. 2వేల కోట్ల నిధులను విడుదల చేసింది. అయితే, సీఎం రేవంత్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణంతో తాజాగా సీఈసీ ఆంక్షలు విధించింది. ఎన్నికలు ముగిసిన తర్వాతే రైతులకు నగదు అందజేయాలని ఆదేశించింది.