Satya: ఆకట్టుకున్న ‘సత్య’ ట్రైలర్.. లాంచ్ ఈవెంట్‌కు 8 మంది దర్శకులు

Satya Official Trailer

  • ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ‘సత్య’
  • ఈ సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్న హమరేశ్
  • తమిళంలో ఇప్పటికే హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమా

శివమ్ మీడియా నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న తొలి సినిమా సత్య ట్రైలర్ విడుదలైంది. 8 మంది దర్శకుల చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. దీనిని మే 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం తెలిపింది. హమరేశ్, ప్రార్థన సందీప్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు వాలీ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్‌కు మంచి స్పందన రాగా, ఇప్పుడు ట్రైలర్‌కు కూడా విశేష స్పందన లభిస్తోంది.

ట్రైలర్ లాంచ్‌కు హాజరైన డైరెక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. జీవీ ప్రకాశ్ లాంచ్ అయినప్పుడు ఎలా ఉన్నాడో హమరేశ్ కూడా అలానే ఉన్నట్టు చెప్పారు. తాను కెరియర్ మొదలుపెట్టినప్పటి నుంచీ నిర్మాత శివ మల్లాల తనకు తెలుసని అన్నారు. సత్య సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 

దర్శకులు శశికిరణ్, సతీశ్ వేగేశ్న, పవన్ సాదినేని, అర్జున్, మధుర శ్రీధర్ తదితరులు మాట్లాడుతూ సత్య ట్రైలర్ బాగుందని ప్రశంసించారు. ఆరిస్టులు బాగా చేశారని కొనియాడారు. నిర్మాత శివకి ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. మీడియా, జర్నలిజం నుంచి ఈ 25 ఏళ్లలో శివ నిర్మాతగా రూపాంతరం చెందారని పేర్కొన్నారు. సత్య సినిమా దర్శకుడు వాలిమోహన్ దాస్ మాట్లాడుతూ తమిళంలో ఈ సినిమాను తాను రంగోలీగా చేశానని, ఇప్పుడు తెలుగులో శివ మల్లాల ద్వారా వస్తున్నట్టు చెప్పారు. ఇక్కడ కూడా సక్సెస్ అందిస్తారని కోరుకుంటున్నట్టు తెలిపారు. 

నిర్మాత శివ మల్లాల మాట్లాడుతూ  ట్రైలర్ లాంచ్ అనగానే 8 మంది డైరెక్టర్లు వచ్చారని పేర్కొన్నారు. ఫొటోగ్రాఫర్‌గా తన ప్రయాణం మొదలుపెట్టి ఈ రోజు ప్రొడ్యూసర్‌ స్థాయికి వచ్చానని చెప్పారు. ఈ నెల 10న సత్య సినిమా వస్తుందని, అందరూ తప్పకుండా చూడాలని కోరారు. తమిళంలో మంచి హిట్ అయిన ఈ సినిమా తెలుగులోనూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్టు నటి ప్రార్థన ఆకాంక్షించారు. నటుడు హమరేశ్ మాట్లాడుతూ శివ మల్లాల వంటి వ్యక్తుల చేతుల  మీదుగా తెలుగులో లాంచ్ అవుతున్నందుకు హ్యాపీగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. 

More Telugu News