Andhra Pradesh: ఏపీ కొత్త డీజీపీ కోసం ఈసీకి ముగ్గురి పేర్లను పంపిన ప్రభుత్వం
- ద్వారకా తిరుమల రావు, హరీశ్‌కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్ పేర్లను సిఫార్సు చేసిన సర్కార్
- ఈ ముగ్గురిలో సీనియారిటీ పరంగా ముందు వరుసలో ఉన్న తిరుమల రావు
- ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌పై ఈసీ బదిలీ వేటుతో ఖాళీ అయిన పోస్టు
ఏపీకి కొత్త డీజీపీ నియామకం కోసం ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లను ఎలక్షన్ కమిషన్ (ఈసీ) కు సర్కార్ పంపించింది. ద్వారకా తిరుమల రావు (ఆర్‌టీసీ ఎండీ), హరీశ్‌కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్ పేర్లను ప్రభుత్వం సిఫార్సు చేయడం జరిగింది. ఈ ముగ్గురిలో సీనియారిటీ పరంగా తిరుమల రావు ముందు వరుసలో ఉన్నారు. ఆయన 1990 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.
ఆ తర్వాత మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి 1991 బ్యాచ్ చెందిన అధికారి కాగా, ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్న హరీశ్‌కుమార్ గుప్తా 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఈ ముగ్గురిలో ఒకరిని డీజీపీ పోస్టు వరించనుంది. కాగా, ద్వారకా తిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. ఇవాళ సాయంత్రానికి ఏపీ నూతన డీజీపీ ఎవరనేది తెలిసే అవకాశం ఉంది. ఇదిలాఉంటే.. ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌పై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేయడంతో ఈ పోస్టు ఖాళీ అయిన విషయం తెలిసిందే.