YS Sharmila: వెయ్యి కోట్లు అడిగానని రుజువు చేయండి రాజకీయాలు వదిలేస్తా: వైఎస్ షర్మిల ఛాలెంజ్
- పోలవరం ప్రాజెక్టుపై చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్న
- మీదొక పార్టీ.. మీరొక మనుషులా అంటూ తీవ్ర వ్యాఖ్యలు
- మోసం చేసిన బీజేపీతోనే చంద్రబాబు కలిసి నడుస్తున్నాడని ఫైర్
- ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమన్న షర్మిల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను రూ.వెయ్యి కోట్ల పని కావాలని తాను అడిగినట్లు నిరూపిస్తే రాజకీయాలు మానేసి వెళ్లిపోతానని వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. ఈమేరకు సోమవారం కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైసీపీ నేతల తప్పుడు ప్రచారంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ తీవ్రంగా మండిపడ్డారు.
జగన్ విసిరే కుక్క బిస్కెట్లకు ఆశపడి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇలా తనపై ఆరోపణలు చేయడం వల్ల వారికి ఎంత మొత్తం ముడుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ పక్కన ఉండే వాళ్లు ఊసరవెల్లులు అని, అవసరాన్ని బట్టి మనుషులను వాడుకుంటారని ఆరోపించారు. అవసరం ఉంటే అమ్మా తల్లీ నువ్వు పాదయాత్ర చేయమ్మా అని అంటారు.. అవసరం తీరాక పుట్టుకనే అవమానిస్తారని, మీదొక పార్టీ.. మీరొక మనుషులా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వైఎస్సార్ మరణం వెనక రిలయన్స్ హస్తం ఉందని నాడు జగన్ ఆరోపించారని, అధికారంలోకి వచ్చాక అదే రిలయన్స్ కంపెనీ చెప్పిన వారికి ఎంపీ టికెట్ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలో లేనప్పుడు వివేకా హత్యలో చంద్రబాబు పాత్ర ఉందని, సీబీఐ విచారణ జరిపించాలని అన్న జగన్.. అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ అవసరంలేదని చెప్పారని తెలిపారు. అంటే నాడు చంద్రబాబుపై చేసిన ఆరోపణలు తప్పని ఒప్పుకున్నట్లేనని షర్మిల అన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ కు పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన బీజేపీతో చంద్రబాబు కలిసి నడుస్తున్నాడని షర్మిల మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ది వైపు నడిపించే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని షర్మిల స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టుపై..
వచ్చే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెబుతున్న వైసీపీ నేతలు ఈ ఐదేళ్లూ ఏంచేశారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే, ప్రాజెక్టు పూర్తిచేయాలనే సంకల్పం ఉంటే ఈ ఐదేళ్లు ప్రాజెక్టు పనులు ఎందుకు పూర్తికాలేదని నిలదీశారు.
సీబీఐ చార్జిషీట్ లో వైఎస్సార్ పేరు..
సీబీఐ చార్జిషీట్ లో వైఎస్సార్ పేరును చేర్పించిందే జగన్ అని షర్మిల ఆరోపించారు. ఆ నిందను కాంగ్రెస్ పై రుద్దేందుకు జగన్ పదే పదే ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ చార్జిషీట్ లో వైఎస్సార్ పేరు లేకుంటే అవినీతి కేసుల్లో నుంచి జగన్ బయటపడడం అసాధ్యమనే ఉద్దేశంతో పొన్నవోలు సుధాకర్ రెడ్డి మూడు కోర్టుల చుట్టూ తిరిగారని గుర్తుచేశారు. జగన్ చెబితేనే సుధాకర్ రెడ్డి ఈ పని చేశారని, దానికి ప్రతిఫలంగా సీఎం సీట్లో కూర్చున్న వారం రోజులకే సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పదవి కట్టబెట్టారని చెప్పారు.
తన భర్త అనిల్ పై వచ్చిన ఆరోపణల గురించి..
కడప ఎంపీ, వైసీపీ నేత అవినాశ్ రెడ్డి తన భర్త అనిల్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని షర్మిల ఫైర్ అయ్యారు. తన భర్తకు ఎవరి ఇంటికీ వెళ్లాల్సిన అవసరంలేదని, ఆయన ఎవరినీ కలవలేదని స్పష్టం చేశారు. బీజేపీ నేతలను అనిల్ కలిశాడనే ఆరోపణ పచ్చి అబద్ధమని తేల్చిచెప్పారు. అవినాశ్ రెడ్డి లాగా అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు తెలియవని షర్మిల విమర్శించారు.