Rahul Gandhi: ఎన్నికల ప్రచారంలో బెస్ట్ పార్ట్ ఏదన్న ప్రశ్నకు రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే.. వీడియో ఇదిగో!
- కర్ణాటకలో ఒకే కారులో రాహుల్, ఖర్గే, సిద్ధరామయ్య ప్రయాణం
- జర్నలిస్ట్ గా మారిన రాహుల్ గాంధీ.. కారులో ఖర్గే, సిద్ధూల ఇంటర్వ్యూ
- పవర్, ఐడియాలజీ.. రెండింట్లో దేనిని ఎంచుకుంటారని నేతలకు ప్రశ్న
- వైట్ టీషర్ట్ లలోనే కనిపించడంపై క్లారిటీ ఇచ్చిన రాహుల్
దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా తిరుగుతున్నారు. అన్ని రాష్ట్రాలను చుట్టివస్తూ, కాంగ్రెస్ కు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రచారం కోసం హెలికాఫ్టర్ లో బయలుదేరుతున్న రాహుల్ గాంధీ అక్కడున్న మీడియాతో మాట్లాడారు. హెలికాఫ్టర్ దగ్గరికి వెళుతూనే పలు ప్రశ్నలకు జవాబిచ్చారు.
ఈ సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన ప్రచారంలో బెస్ట్ పార్ట్ ఏదంటూ మీడియా అడగగా.. కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినపుడు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యలతో కలిసి ఒకే కారులో ప్రయాణించానని చెప్పారు. ఆ సమయంలో తమ మధ్య మంచి చర్చ జరిగిందని, అదే బెస్ట్ పార్ట్ అని చెబుతూ అప్పటి సంఘటనను గుర్తుచేసుకున్నారు.
ముగ్గురు సీనియర్ నేతలు ఒకే కారులో ఉండడంతో సడెన్ గా రాహుల్ గాంధీ జర్నలిస్ట్ అవతారమెత్తారు. సీఎం సిద్ధరామయ్యను, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ప్రశ్నలు వేస్తూ, జవాబులు రాబడుతూ తన ఫోన్ లో రికార్డు చేశారు. ‘పవర్ - ఐడియాలజీ’ లలో దేనిని ఎంచుకుంటారంటూ వారిద్దరినీ ప్రశ్నించారు. నేతలిద్దరూ ఐడియాలజీనే ఎంచుకుంటామంటూ దానికి కారణం వివరించారు. పవర్ వస్తూపోతూ ఉంటుంది కానీ పార్టీ ఐడియాలజీకి కట్టుబడి ఉండడం ముఖ్యమని ఖర్గే.. పార్టీ ఐడియాలజీని ప్రజల ముందు ఉంచి, ఒప్పించినపుడే వారు మనలను ఆశీర్వదిస్తారని సిద్ధరామయ్య చెప్పారు.
వారి అభిప్రాయలతో తానూ ఏకీభవిస్తానని రాహుల్ చెప్పారు. తన ఉద్దేశంలో.. ఐడియాలజీని సంపూర్ణంగా అర్థం చేసుకోకుండా అధికారాన్ని చేరలేమని రాహుల్ గాంధీ చెప్పారు. కాగా, రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ టీషర్టులు.. అదీ వైట్ టీషర్టు మాత్రమే ధరించడం వెనక కారణమేంటనే ప్రశ్నకు జవాబిస్తూ పారదర్శకత, సింప్లిసిటీ కోసమేనని చెప్పారు. తాను ఎక్కువగా దుస్తులపై దృష్టిపెట్టనని చెబుతూ హెలికాఫ్టర్ ఎక్కి వెళ్లిపోయారు.