International No Diet Day: నోరు కట్టేసుకోవద్దు.. ఈ ఒక్కరోజైనా నచ్చినట్టు తినండి.. ఎందుకంటే!?
- అందమైన ఆకృతి కోసమంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దంటున్న నిపుణులు
- దీనిపై అవగాహన కోసమే మే 6న ‘అంతర్జాతీయ నో డైట్ డే’
- నచ్చింది కదా అని జంక్ ఫుడ్ కు మాత్రం దూరంగా ఉండాలని సూచన
ఇంటర్నెట్ లో, మేగజైన్లలో మోడళ్లు, సినీ నటుల ఫొటోలు చూసి.. వారిలా తయారుకావాలనే కోరికతో చాలా మంది సరిగా ఆహారం తినడం మానేస్తుంటారు. విపరీతంగా డైటింగ్, పరిమితికి మించి వ్యాయామాలు చేస్తుంటారు. ఉన్న సమస్యలు చాలనట్టు కొత్త ఆరోగ్య సమస్యలు తెచ్చిపెట్టుకుంటుంటారు. సరైన పోషకాహారం లేక వ్యాధుల బారిన కూడా పడుతుంటారు. ముఖ్యంగా అమ్మాయిలైతే సన్నగా ఉండటం కోసమని ఎంతో తపన పడుతుంటారు.
మీ శరీరాన్ని ప్రేమించండి
మరి నిపుణులు చెప్తున్నదేంటి? మోడళ్లు, సినీ నటుల ఫొటోల్లో చాలా వరకు ఫొటోషాప్ చేసినవే. నిజంగా అలాంటి శరీరాకృతులు అసాధారణం. ఎందరో నిపుణుల పర్యవేక్షణలో రోజంతా కఠిన నియమాలతో.. వారు అలా ఉంటుంటారు. అది వారికి అవసరం. కానీ మనకు అనవసరమని.. మన శరీరాన్ని పాజిటివ్ దృక్పథంతోనే చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఎందరో నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఏటా మే 6వ తేదీన ‘అంతర్జాతీయ నో డైట్ డే’ను పాటిస్తున్నారు.
మేరీ ఇవాన్స్ చొరవతో మొదలై..
సుమారు 30 ఏళ్ల కింద అమెరికాకు చెందిన మేరీ ఇవాన్స్ అనే యువతి.. మోడల్స్ ను, హీరోయిన్లను చూసి.. తానూ అలా కావాలని అనుకుంది. ఈ క్రమంలో ‘అనెరెక్సియా’ బారిన పడింది. అంటే తింటే ఎక్కడ లావైపోతామేమో అని ఆహారం విపరీతంగా తగ్గించే మానసిక వ్యాధి. దీని బారినపడినవారు సన్నగా అయిపోయి, ఎముకలు తేలి కనబడుతున్నా కూడా సరిగా ఆహారం తీసుకోరు. కొన్నాళ్లకు వైద్యులు, తోటివారి సాయంతో మేరీ ఇవాన్స్.. ఈ ‘అనెరెక్సియా’ నుంచి బయటపడింది. తనలా మరెవరూ ఇబ్బందిపడకుండా అవగాహన కల్పించేందుకు.. 1992లో ‘డైట్ బ్రేకర్స్’ అనే సంస్థను స్థాపించింది. ఆమె చొరవతోనే ఏటా మే 6వ తేదీన ‘ఇంటర్నేషనల్ నో డైట్ డే’గా పాటించడం మొదలైంది.
అందరి శరీర తత్వం ఒకలా ఉండదని గ్రహించాలి
మనుషుల్లో అందరి శరీర తత్వం ఒకలా ఉండదని.. మనలోని జన్యువులు, అలవాట్లు, జీవిస్తున్న వాతావరణం కూడా శరీరాన్ని ప్రభావితం చేస్తాయని ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ నో డైట్ డే లక్ష్యం. ‘లావు, సన్నం, పొడవు, పొట్టి.. ఇలా అన్నిరకాల శరీరాల వారిని గౌరవించాలి, శరీరాన్ని అవహేళన చేస్తూ అవమానించకూడదు. మీ శరీరాన్ని ప్రేమించండి. మీలాగే ఇతరులనూ భావించండి.’ అనేదే దీని నినాదం.
బలవంతంగా నోరుకట్టేసుకోవద్దు. నచ్చింది తినండి.. అలాగని జంక్ ఫుడ్, ఇతర నానా చెత్త తిని ఆరోగ్యం పాడు చేసుకోవద్దన్న విషయం మాత్రం మర్చిపోవద్దు.